Chicken Prices: కొండెక్కిన కోడి.. ఆకాశాన్నంటిన చికెన్ ధరలు
మాసం ప్రియులకు ఇది నిజంగా చేదువార్త. ఎందుకంటే చికెన్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. మెున్నటి వరకు కేజీ రూ. 200 పలికన ధర ఉన్న ఫళంగా పెద్ద మొత్తంలో పెరిగింది.
Chicken Prices: మాసం ప్రియులకు ఇది నిజంగా చేదువార్త. ఎందుకంటే చికెన్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. మెున్నటి వరకు కేజీ రూ. 200 పలికన ధర ఉన్న ఫళంగా పెద్ద మొత్తంలో పెరిగింది. ఓ వైపు బర్డ్ ఫ్లూ భయాలు వెంటాడుతున్నప్పటికీ చికెన్ రేట్లు పెరుగుతుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. చికెన్ షాపుల వద్దకు వెళ్లిన మాంసం ప్రియులు ఒక్క సారిగా పెరిగిన ధరలను చూసి అవాక్కవుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఒక్కరోజులోనే చికెన్ ధరలు ఆల్ టైం రికార్డుకు చేరుకున్నాయి. బుధ, గురు వారాల్లో రూ.150 నుంచి 200 ఉన్న కిలో లైవ్ కోడి.. నిన్న ధర అమాంతం పెరిగిపోయింది. కోళ్ల సరఫరా తగ్గడంతో వ్యాపారులు ధరలు పెంచేశారు. వినియోగదారుల అవసరం మేరకు ఉత్పత్తి లేకపోవడంతో కోడి మాంసం ధరలు కొండెక్కి కూర్చున్నాయి. దీంతో మాంసహార ప్రియులు గగ్గోలుపెడుతున్నారు.
ధరలు అమాంతం పెరగడంతో కేజీ కొనాల్సిన చోట అరకేజీకే పరిమితం అవుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. డిమాండ్‌కు సరిపడా సప్లై లేకపోవటం కూడా ధరల పెరుగుదలకు కారణంగా వ్యాపారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇదిలా ఉంటే కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. మటన్ కూడా కేజీ రూ. 800 నుంచి రూ. 1000 పలుకుతోంది. దీంతో చాలా మంది ఏదో తిన్నాంలే అన్నట్లుగా అరకేజీ, పావుకేజీతో మమ అనిపించి తమ జిహ్వాచాపల్యాన్ని తీర్చుకుంటున్నారు.