తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత(jayalalitha) కొన్ని సంవత్సరాల క్రితం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆమె ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలోనే అనారోగ్యానికి గురై కొన్ని నెలల పాటు ఆస్పత్రిలో చికత్స పొందారు. అలా చికిత్స పొందుతూనే ఆమె కన్నుమూశారు. అయితే… ఆమె హాస్పిటల్ లో ఉన్నంత కాలం ఆమె జీవితం ఎలా గడిచింది అనే విషయంలో ఎవరికీ క్లారిటీ లేదు. ఎవరికి తోచినది వారు మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే… తాజాగా ఆమె ఆస్పత్రిలో ఉన్న సమయంలో.. హాస్పిటల్ సిబ్బంది తో మాట్లాడిన ఓ ఆడియో క్లిప్ ఇప్పుడు కలకలం రేపుతుంది.
ఆమె చివరి రోజుల్లో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తీవ్రమైన దగ్గుతో ఆసుపత్రి సిబ్బందితో జయలలిత మాట్లాడిన ఆడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రెండు రోజుల క్రితమే జయ మృతి విషయం మీద ఆర్ముగ స్వామి కమిషన్ నివేదిక విడుదల చేసింది. ఇప్పుడు ఈ దగ్గుతో కూడి జయలలిత మాట్లాడుతున్న ఆడియో విడుదల కావడంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
కమిటీ రిపోర్ట్‌ను స్టాలిన్ ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టడంతో మరోసారి ఈ వ్యవహారంలో రకరకాల ప్రచారాలు తెర మీదకు వస్తున్నాయి. ఇక క్లిప్ లో 2015లో చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో జయలలిత బెడ్ పై ఉన్నప్పుడు మాట్లాడినట్లు తెలుస్తోంది. తాను పిలిచినపుడు మీరెందుకు రాలేదంటూ డాక్టర్లపై జయలలిత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు ఆ ఆడియోలో ఉంది. అదే సమయంలో ఆమె దగ్గుతూ ఆయాసపడుతున్నట్లు.. ఆడియో ద్వారా విన్నవారికి ఎవరికైనా అర్థమవుతోంది. ఇంతలా బాధపడున్నా మీరు ఎందుకు పట్టించుకోవడం లేదంటూ ఆమె అసహనం వ్యక్తం చేసినట్లు అందులో ఉంది.
ఆమె మాటలను ఆస్పత్రి సిబ్బంది రికార్ట్ చేసినట్లు భావిస్తున్న ఇప్పుడు ఆ ఆడియో ఎలా బయటికి వచ్చింది అనే విషయం మీద చర్చ జరుగుతోంది. దీంతో జయలలితకు అందించిన వైద్యం పై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆమె మరణానికి శశికళే కారణం అని వాదించేవారు కూడా ఉన్నారు.