పార్టీలో చీలిక రాకుండా జగన్ ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. ఎందుకంటే వచ్చే ఎన్నికలకు అతి విశ్వాసంతో ఉన్నారు. 175కు 175 స్థానాలు గెలువాలని సాధ్యం కాని లక్ష్యాన్ని పెట్టుకుని వెళ్తున్నారు. ఈ క్రమంలో సొంత పార్టీ నాయకులే తిరుగుబాటు చేస్తే మొదటికే మోసానికి వస్తుందని జగన్ రంగంలోకి దిగారు.
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పార్టీలో అసంతృప్తులు పెరిగాయి. క్షేత్రస్థాయి నుంచి రెండో స్థాయి వరకు నాయకుల మధ్య విబేధాలు తీవ్రమయ్యాయి. మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధుల పెత్తనాలు అధికమయ్యాయి. పార్టీని నమ్ముకున్న వారికి న్యాయం చేయకపోవడం.. ప్రత్యర్థి వర్గానికి ప్రాధాన్యం కల్పించడం వంటివి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP)ని తీవ్ర దెబ్బ తీస్తున్నాయి. ఇక పెద్ద స్థాయిలో అంటే మంత్రులు (Ministers), ఎమ్మెల్యేల (MLAs)పై ప్రభుత్వం నిఘా పెట్టడం తీవ్ర కలకలం రేపుతున్నది. పార్టీని కాపాడాల్సిన వాళ్లే కక్ష సాధింపు చర్యలు, పొమ్మనలేక పొగబెట్టే పనులు చేస్తుండడంతో అధికార పార్టీలో కొన్ని వర్గాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే నెల్లూరు (Nellore) జిల్లాలో భారీ కుదుపు వచ్చింది. ఎమ్మెల్యేలు ఆనం, కోటంరెడ్డి బహిరంగంగా ప్రభుత్వాన్ని విమర్శించారు. వారు పార్టీని వీడకపోయినా దూరం జరిగారు. ఈ వ్యవహారం నెల్లూరు జిల్లాలో పార్టీకి తీవ్ర నష్టం జరిగింది. అయితే ఈ వ్యవహారం ఇతర జిల్లాలకు కూడా పాకే ప్రమాదం ఉండడంతో వెంటనే పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) రంగంలోకి దిగారు. పార్టీలో ఎన్నాళ్ల నుంచో రగులుతున్న అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందులో ప్రధానంగా ఎన్టీఆర్ జిల్లా (NTR District)లోని మైలవరం (Mylavaram) నియోజకవర్గం నుంచి ప్రారంభించారు.
అకస్మాత్తుగా ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ (Vasantha Venkata Krishna Prasad)ను పిలిపించుకుని సీఎం జగన్ ప్రత్యేకంగా మాట్లాడడానికి అదే కారణమని తెలుస్తున్నది. నెల్లూరు వ్యవహారానికి ముందే వసంత వైఎస్సార్ సీపీని వీడుతారనే ప్రచారం జోరుగా ఉంది. మళ్లీ మైలవరం సీటు ఇస్తే టీడీపీ (TDP)లో చేరడానికి సిద్ధమనే వార్తలు వచ్చాయి. ఆ క్రమంలోనే నియోజకవర్గంలో బాలకృష్ణ (Balakrishna) సినిమాకు పోస్టర్లు ఎమ్మెల్యే ఫొటోతో వెలిశాయి. ఆ తర్వాత బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలపై సానుకూలంగా వసంత కృష్ణప్రసాద్ మాట్లాడడం పార్టీ మారుతాడనే వార్తలకు ఆజ్యం పోసింది. వసంత పార్టీపై అలక వహించడానికి చాలా కారణాలే ఉన్నాయి. పెడన ఎమ్మెల్యేగా ఉన్న జోగి రమేశ్ (Jogi Ramesh) మంత్రి అయినప్పటి నుంచి మైలవరంపై పెత్తనం మొదలైంది. మైలవరం వ్యవహారాల్లో జోగి రమేశ్ కలుగజేసుకోవడం, పార్టీలో విలువనివ్వకపోవడం వంటివి జరుగుతున్నాయి. ఇలా చాలా నియోజకవర్గాల్లో మంత్రులు ఇతర ఎమ్మెల్యేల వ్యవహారాల్లో కల్పించుకోవడం సొంత పార్టీలో అసంతృప్తులు పెరుగుతున్నాయి. చిత్తూరు, నెల్లూరు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అలాంటి పరిస్థితులు ఉన్నాయి. చాలా నియోజకవర్గాల్లో పార్టీ రెండుగా చీలింది.
అయితే నెల్లూరు మాదిరి మరింత మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తారనే భయం జగన్ లో మొదలైంది. నెల్లూరు కుదుపును తాత్కాలికంగా సర్దుబాటు చేశాడు. కానీ మిగతా నియోజకవర్గాల్లో అసంతృప్తి జ్వాలలు బయటకు రాక ముందే వైఎస్సార్ సీపీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. పార్టీలో చీలిక రాకుండా జగన్ ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. ఎందుకంటే వచ్చే ఎన్నికలకు అతి విశ్వాసంతో ఉన్నారు. 175కు 175 స్థానాలు గెలువాలని సాధ్యం కాని లక్ష్యాన్ని పెట్టుకుని వెళ్తున్నారు. ఈ క్రమంలో సొంత పార్టీ నాయకులే తిరుగుబాటు చేస్తే మొదటికే మోసానికి వస్తుందని జగన్ రంగంలోకి దిగారు. బుజ్జగింపు చర్యలు ప్రారంభించగా.. అది మైలవరం నియోజకవర్గం నుంచే మొదలు పెట్టాడు. వసంత కృష్ణప్రసాద్ కు ఊహించని రీతిలో 20-30 ఏళ్ల పాటు సుదీర్ఘ భవిష్యత్ పై జగన్ హామీ ఇచ్చారు. ఇదే మాదిరి పార్టీపై అసంతృప్తి ఉన్న నాయకులను పిలిచి జగన్ స్వయంగా మాట్లాడనున్నారని తెలుస్తున్నది. వసంత కృష్ణ ప్రసాద్ కు ఇచ్చిన భారీ హామీలు వారికి కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా 2023 వరకు అసంతృప్తులను తగ్గించి ఎన్నికల వరకు పార్టీని సంసిద్ధం చేయాలని జగన్ వ్యూహం. జగన్ దిగొచ్చి చర్యలు తీసుకోవడంతో మరి పార్టీలో పరిస్థితులు చక్కబడతాయో లేదో వేచి చూడాలి.