IT Raids At Minister Malla Reddy Followers Residence
Malla Reddy: మరో 5 రోజుల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ప్రచార పర్వంలో నేతలు బిజీగా ఉన్నారు. ప్రలోభాలు కూడా జోరుగా జరుగుతున్నాయి. మద్యం, నగదు, చీరలు, గిప్ట్స్ కూడా అందజేస్తున్నారు. ఇటు ప్రధాన పార్టీలకు చెందిన కీలక నేతలు, అనుచరులపై ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి.
మంత్రి మల్లారెడ్డి (Malla Reddy) ఇళ్లు, కార్యాలయాలపై ఇప్పటికే చాలా సార్లు ఐటీ రైడ్స్ జరిగాయి. ఇప్పుడు ఆయన అనుచరుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. మల్లారెడ్డి అనుచరుడు, బీఆర్ఎస్ బోడుప్పల్ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి (sanjeeva reddy) ఇంట్లో తనిఖీలు చేపట్టారు. సంజీవరెడ్డి ఇంటికి మల్లారెడ్డి భారీగా డబ్బు చేరిందనే ఫిర్యాదు వచ్చింది. దీంతో ఐటీ అధికారులు సోదాలు చేశారు. సంజీవ రెడ్డి ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకుని సోదాలు చేశారు. సోదాల్లో డబ్బు దొరకలేదు. సోదాల సమయంలో సంజీవరెడ్డి ఇంటి ముందు బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు నినాదాలు చేశారు.
మరోవైపు పాతబస్తీలో కూడా ఐటీ రైడ్స్ జరిగాయి. ఓ రాజకీయ పార్టీకి పెద్ద మొత్తంలో నిధులు సమకూర్చుతారనే సమాచారంతో బడా వ్యాపారస్తుల ఇళ్లలో సోదాలు చేశారు. ఫలక్ నుమా కింగ్స్ ప్యాలెస్ యజమాని షానవాజ్ ఇంట్లో రైడ్స్ చేశారు. ఫంక్షన్ హాల్, ఆఫీస్, హోటల్స్‌లో సోదాలు చేపట్టారు. బీఆర్ఎస్ పార్టీ సలహాదారుడిగా పనిచేసిన మాజీ ఐఏఎస్ ఏకే గోయల్ నివాసంలో నిన్న రాత్రి తనిఖీలు చేపపట్టారు.