Assets:100 కోట్ల ఆస్తులు చూపిన మర్రి జనార్థన్, అర్వింద్.. మల్లారెడ్డికి సొంత కారు లేదట
అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్లో నేతలు ఆస్తులు, అప్పుల వివరాలు ప్రకటిస్తున్నారు. ఒక్కో నేత తనకు కారు లేదని పేర్కొన్నారు. వందల కోట్ల ఆస్తి కలిగి ఉన్నానని.. కానీ తన పేరు మీద కార్లు లేవని చెబుతున్నారు.
Assets: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. తమ వివరాలు, ఆస్తుల వివరాలను అభ్యర్థులు ప్రకటిస్తున్నారు. స్థిరాస్థులు ఉన్నాయని ఒకరి, భూములు ఉన్నాయని మరొకరు, లోన్ లేదని ఇంకొకరు, కారు కూడా లేదని మరొకరు చెబుతున్నారు. ఇప్పటివరకు ఏ నేత.. ఆస్తులు, అప్పులు ఎన్నో తెలుసుకుందాం. పదండి.
చేతిలో రూపాయి లేదు
మల్లారెడ్డి విద్యాసంస్థల అధినేత, మంత్రి చామకూర మల్లారెడ్డి.. మేడ్చల్ నుంచి పోటీ చేస్తున్నారు. తనకు రూ.95 కోట్ల ఆస్తులు ఉన్నాయని ప్రకటించారు. చేతిలో రూపాయి లేదని, కారు కూడా లేదని అఫిడివిట్లో పేర్కొన్నారు. సూరారం, కండ్లకోయ, ధూలపల్లి, జీడిమెంట్ల, గుండ్ల పోచంపల్లి, గుండ్ల పోచారంలో వ్యవసాయ భూములు ఉన్నాయని తెలిపారు. మైసమ్మగూడ, ఫిరోజ్ గూడ, బోయిన్ పల్లి, కొంపల్లి, అబిడ్స్‌లో కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నాయని వివరించారు. తన పేరు మీద రూ.41 కోట్ల, భార్య కల్పన పేరు మీద రూ.38 కోట్లు, డిపెండెంట్ పేరు మీద రూ.10 కోట్ల స్థిర ఆస్తులు ఉన్నాయని వెల్లడించారు. వివిధ బ్యాంకుల్లో రూ.7.5 కోట్ల అప్పులు ఉన్నాయని ప్రకటించారు.
గంగుల లోన్ ఎంతో తెలుసా..?
మరో మంత్రి గంగుల కమలాకర్ రూ.34.08 కోట్ల ఆస్తులు ఉన్నాయని ప్రకటించారు. ఇందులో రూ.7 కోట్ల వజ్రాభరణాలు ఉన్నాయి. రూ.11.03 చరాస్తులు ఆయన పేరు మీద ఉన్నాయి. భార్య పేరు మీద రూ.7.87 కోట్లు ఉన్నాయి. గంగుల పేరు మీద స్థిరాస్థులు రూ.13.97 కోట్లు, భార్య పేరు మీద స్తంభంపల్లి, గుండ్లపల్లిలో 5 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయని తెలిపారు. తనకు రూ.50.63 లక్షల లోన్ ఉందని ప్రకటించారు.
భట్టికి అప్పు లేవట
మధిర కాంగ్రెస్ అభ్యర్థి భట్టి విక్రమార్క తనకు రూ.8.12 కోట్ల ఆస్తులు ఉన్నాయని పేర్కొన్నారు. అప్పులు లేవని ప్రకటించడం గమనార్హం. నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్థన్ రెడ్డి రూ.112.23 కోట్ల ఆస్తులను చూపించారు. కోరుట్ల నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన అర్వింద్ తనపై 17 కేసులు ఉన్నాయని.. రూ.107.43 కోట్ల ఆస్తులు ఉన్నాయని ప్రకటించారు. పాలేరు నుంచి బరిలోకి దిగిన కంపాల ఉపేందర్ రెడ్డి రూ.89.57 కోట్ల ఆస్తులను ప్రకటించారు. భార్య పేరు మీద 82 లక్షల షేర్లు ఉన్నాయని తెలిపారు. మహబూబాబాద్ అభ్యర్థి శంకర్ నాయక్ కుటుంబానికి 52.23 ఎకరాల వ్యవసాయ భూమి, వాణిజ్య భవనాలు ఉన్నాయని పేర్కొన్నారు. మొత్తం ఆస్తి విలువ రూ.21.06 కోట్లుగా చూపించారు. ఖైరతాబాద్ అభ్యర్థి దానం నాగేందర్ రూ.6.68 కోట్ల వజ్రాలు ఉన్నాయి. 3 కిలోల బంగారం.. 54.17 ఎకరాల వ్యవసాయ భూములను చూపించారు. అడ్వాన్స్, అప్పు కలిసి రూ.49.55 కోట్లు ఉందన్నారు.
రాజస్థాన్‌లో వ్యవసాయ భూమి
సనత్ నగర్ అభ్యర్థి కోట నీలిమ రూ.54.75 కోట్ల ఆస్తులు ఉన్నాయని ప్రకటించారు. 8.01 కిలోల బంగారు ఆభరణాలు, నాణేలు ఉన్నాయని చూపారు. రాజస్థాన్‌లో 10.15 ఎకరాల వ్యవసాయ భూమి, ఇల్లు ఉందన్నారు. మజ్లిస్ అభ్యర్థి అక్బరుద్దీన్ తనపై 6 కేసులు.. రూ.18.77 కోట్ల ఆస్తులు ఉన్నాయని ప్రకటించారు. ఇప్పటివరకు అయితే ఆస్తుల ప్రకటనలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అగ్రస్థానంలో ఉన్నారు.