CAR ACCIDENT : దైవ దర్శనానికి వెళ్లి గుడి నుంచి తిరిగి వస్తున్న కారు రోడ్డు సరిహద్దు గోడను ఢీకొట్టింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. మరో ఐదుగురు సైతం గాయ పడ్డారు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం మధ్య ప్రదేశ్‌లోని సీహోర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంపై(ACCIDENT) సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృత దేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలాగే గాయ పడిన వారికి సైతం సహాయక చర్యలను వేగవంతం చేశారు. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు.
శుక్రవారం అక్షయ తృతీయ సందర్భంగా భోపాల్‌కు చెందిన పాండే కుటుంబం దైవ దర్శనానికి బయలు దేరారు. కుటుంబంలో ఉన్న ఐదు నెలల పాపాయికి తలనీలాలు అర్పించడానికి వారు ఈ ప్రయాణం మొదలు పెట్టారు. అక్కడి సల్కాన్పూర్లో(SALKANPUR) ఉన్న బిజాసన్మాత ఆలయానికి వెళ్లారు. పాపాయికి తలనీలాలు అర్పించి, దైవ దర్శనం చేసుకున్నారు.
తర్వాత గుడి నుంచి తిరుగు ప్రయాణం అయ్యారు. సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో వారంతా ప్రయాణిస్తున్న కారు(CAR) అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న సరిహద్దు గోడను బలంగా ఢీకొట్టింది. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఈ ఘటన గురించి తెలుసుకున్న మాజీ సీఎం కమల్ నాథ్ విచారం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.