»Madanapalle The Son Who Killed His Father Was Not Given A Share In The Property
Madanapalle: ఆస్తిలో వాటా ఇవ్వలేదని.. తండ్రిని చంపిన కుమారుడు
ఆస్తిలో వాటా ఇవ్వలేదని కుమారుడు తండ్రినే చంపాడు. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె పట్టణానికి చెందిన మీరుగట్టు చిన్నరెడ్డప్పరెడ్డి పెద్ద కుమారుడు కారుతో ఢీకొట్టి తండ్రిని హత్య చేశాడు.
Madanapalle: ఆస్తిలో వాటా ఇవ్వలేదని కుమారుడు తండ్రినే చంపాడు. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె పట్టణానికి చెందిన మీరుగట్టు చిన్నరెడ్డప్పరెడ్డికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు రఘునాథరెడ్డి ఓ ప్రైవేటు కాలేజీలో అధ్యాపకుడిగా పనిచేశారు. కానీ ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. చిన్నకుమారుడు సాఫ్ట్వేర్ ఉద్యోగి. పెద్ద కుమారుడు ఆన్లైన్ ట్రేడింగ్ చేస్తూ రూ.16 లక్షల వరకు అప్పులపాలయ్యాడు. అప్పులు వేధింపులు ఎక్కువ కావడంతో ఆస్తిలో వాటా ఇవ్వమని తండ్రిని కోరాడు. దీంతో ఇద్దరి మధ్య వివాదం కొనసాగుతోంది.
ఈ క్రమంలో నిన్న రాత్రి భోజనం చేశాక సమీపంలోని వాకింగ్ ట్రాక్‌పై చిన్నరెడ్డప్పరెడ్డి నడుస్తున్నాడు. అక్కడ రఘునాథరెడ్డి తండ్రిని నిలదీశాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన రఘునాథరెడ్డి తన కారుతో తండ్రిని ఢీకొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని బెంగళూరులో ఉన్న సోదరుడికి ఫోన్ చేసి చెప్పాడు. శంకర్‌రెడ్డి స్థానికంగా ఉన్న బంధువులకు సమాచారం ఇవ్వడంతోపాటు పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో బంధువులు, పోలీసులు రాత్రంతా చిన్నరెడ్డప్ప కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
గురువారం తెల్లవారుజామున పట్టణంలోని వీవర్స్ కాలనీ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో చిన్నరెడ్డప్ప మృతదేహాన్ని గుర్తించారు. మదనపల్లె డీఎస్పీ ప్రసాద్‌రెడ్డి, సీఐ యువరాజు వివరాలు సేకరించి మృతదేహాన్ని మదనపల్లె సర్వజన బోధనాసుపత్రికి తరలించారు. మృతుడి చిన్నకుమారుడు శంకర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు రఘునాథరెడ్డిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి కారును కూడా స్వాధీనం చేసుకున్నారు.