తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన మరోసారి వాయిదా పడ్డట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు కొనసాగుతుండడంతో ఫిబ్రవరి 13న తెలంగాణకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. వాస్తవంగా సంక్రాంతికి తెలంగాణలో మోదీ పర్యటించాల్సి ఉంది. వందే భారత్ రైలు ప్రారంభం, సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపనతో పాటు మరికొన్ని కార్యక్రమాల కోసం ప్రధాని హైదరాబాద్ కు రావాల్సి ఉంది. అధికారికంగా షెడ్యూల్ ఖరారైంది. కానీ అనివార్య కారణాలతో ఆ పర్యటన రద్దయ్యింది.
ఇక ఈనెల 13న తెలంగాణలో మోదీ పర్యటిస్తారని నెల రోజుల ముందే ప్రకటించారు. ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే ఈసారి కూడా మోదీ వచ్చే ఆస్కారం లేదు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల దృష్ట్యా తెలంగాణకు సమయం కేటాయించే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఈసారి కూడా పర్యటన వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. ఆయనకు బదులు కేంద్ర హోం మంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. అమిత్ షా పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఖరారైంది.
పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా అమిత్ షా తెలంగాణకు రానున్నారు. ఫిబ్రవరి 11న మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, ఆదిలాబాద్, పెద్దపల్లి లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో పర్యటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. తెలంగాణలో అధికారం కోసం కాషాయ పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ క్రమంలో అమిత్ షాను రంగంలోకి దింపాలని చర్చ నడుస్తోంది. పాలమూరు ఎంపీగా అమిత్ షా పోటీ చేస్తారనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో అమిత్ షా పర్యటించడం హాట్ టాపిక్ గా మారింది. ఇక పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ నెలాఖరున రానున్నట్లు సమాచారం.