»Death Of Innocent Child While Playing In School Cctv Footage Surfaced Fear Of Heart Attack
Heart Attack : విషాదం.. గుండెపోటుతో రెండో తరగతి విద్యార్థి మృతి
ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో శనివారం ఓ హృదయ విదారక సంఘటన వెలుగు చూసింది. ఇక్కడ 2వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి పాఠశాల ఆవరణలో ఆడుకుంటూ మృతి చెందాడు.
Heart Attack : ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో శనివారం ఓ హృదయ విదారక సంఘటన వెలుగు చూసింది. ఇక్కడ 2వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి పాఠశాల ఆవరణలో ఆడుకుంటూ మృతి చెందాడు. పరిగెత్తుతుండగా ఒక్కసారిగా విద్యార్థి నేలపై పడి మృతి చెందినట్లు సమాచారం. ప్రాథమిక విచారణలో గుండెపోటు వచ్చినట్లు అనుమానిస్తున్నారు. మృతి చెందిన విద్యార్థిని 8 ఏళ్ల చంద్రకాంత్‌గా గుర్తించారు. అతను ఠాణా సౌత్ ప్రాంతంలోని హిమాయున్పూర్ నివాసి, పొరుగున ఉన్న హన్స్ వాహిని పాఠశాలలో చదువుకున్నాడు. శనివారం మధ్యాహ్నం పాఠశాలలో భోజన విరామం సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చంద్రకాంత్ ఇతర పిల్లలతో కలిసి బయట ఆడుకుంటుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. చుట్టుపక్కల పిల్లలు అతన్ని లేపడానికి ప్రయత్నించారు. కానీ అతను అపస్మారక స్థితిలోపూ ఉండిపోయాడు.
చంద్రకాంత్‌ను వెంటనే మెడికల్ కాలేజీకి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. చంద్రకాంత్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. తన మేనల్లుడు చనిపోయాడని స్కూల్ నుంచి ఫోన్ వచ్చిందని చంద్రకాంత్ మామ ప్రమోద్ కుమార్ తెలిపారు. చిన్నారి శరీరంపై ఎలాంటి గాయాలు, రక్తపు గుర్తులు లేవని, మృతి ఎలా జరిగిందనేది విచారణలో తేలాల్సి ఉందన్నారు. చంద్రకాంత్ ఆడుకుంటూ హఠాత్తుగా కిందపడి మృతి చెందినట్లు స్కూల్ మేనేజర్ తెలిపారు. ఆయనకు గుండెపోటు వచ్చి ఉండొచ్చని తెలుస్తోంది. ఈ ఘటన సీసీటీవీలో రికార్డవ్వడంతో చిన్నారిని ఎవరూ తోసేయలేదని తెలుస్తోంది. ఈ ఘటన ఆ ప్రాంతమంతా సంచలనం రేపింది. చంద్రకాంత్ కుటుంబం పరిస్థితి విషమించి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.