అమ్మాయేమో విదేశాల్లో.. అబ్బాయేమో భారతదేశంలోని మారుమూల పల్లెటూరు. అయినా వారిద్దరినీ కలిపింది ఫేస్ బుక్. వారిద్దరికి ఫేస్ బుక్ ద్వారా పరిచయం కాగా.. అది కాస్త కొన్నాళ్లకు ప్రేమగా చిగురించింది. అలా పదకొండేళ్లు ప్రేమించుకున్నారు. కలుసుకునే అవకాశం లేక ఫోన్లు, వాట్సాప్ ద్వారా ప్రేమించుకుంటూ వచ్చారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోతుండడంతో వెంటనే అమ్మాయి స్వీడన్ దేశం నుంచి భారత్ కు వచ్చేసింది. వచ్చి రాగానే మారుమూల పల్లెటూరి యువకుడిని భారత సంప్రదాయం ప్రకారం పెళ్లాడింది. ఇదంతా సినిమా కథ కాదు. వాస్తవంగా జరిగిన కథే ఇది. ఈనెల 27వ తేదీన వారి వివాహం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్ లోని ఎటా జిల్లా అవ్ ఘడ్ గ్రామానికి చెందిన పవన్ కుమార్ బీటెక్ చదివాడు. ప్రస్తుతం ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. అతడు చదువుకుంటున్న సమయంలో అంటే 2012లో స్వీడన్ దేశానికి చెందిన క్రిస్టేన్ లైబర్ట్ తో ఫేస్ బుక్ లో పరిచయమైంది. అప్పుడు పవన్ వయసు 19 ఏళ్లు. ఇద్దరు తరచూ ఫేస్ బుక్ లో మాట్లాడుకునే వారు. ఈ నేపథ్యంలో భారతదేశం గురించి పవన్ లైబర్ట్ కు వివరించాడు. దీంతో ఆ అమ్మాయి మన దేశంపై ఎంతో అభిమానం పెంచుకుంది. దేశంలోని సుందర ప్రదేశాలు, మన సంప్రదాయాలు, కట్టుబొట్టు అన్నీ ఆమెకు నచ్చాయి. వారి పరిచయం కాస్త ఫోన్లు, అనంతరం వాట్సప్ కు చేరాయి. తరచూ వీడియో కాల్స్ తదితర మాట్లాడుకుంటుండడంతో వారి మధ్య ప్రేమ మరింత పెరిగింది. గతేడాది భారత్ కు వచ్చి పవన్ ను కలిసిన లైబర్ట్ తాజ్ మహల్ ను సందర్శించింది. పవన్ కుటుంబసభ్యులతో మాట్లాడి వెళ్లింది. అక్కడ తన తల్లిదండ్రులను వివాహానికి అంగీకరించేలా చేసింది.
ఈ శుభవార్తతో స్వీడన్ వదిలేసి భారతదేశానికి వచ్చి వాలిపోయింది. ఈనెల 27న అవఘర్ లోని ఓ పాఠశాలలో పవన్, క్రిస్టేన్ లైబర్ట్ వివాహం చేసుకున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకోవడం విశేషం. చీరకట్టులో క్రిస్టేన్ మెరిసింది. విదేశీ అమ్మాయి తమ కోడలుగా కావడంపై పవన్ తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. తమలో క్రిస్టేన్ కలిసిపోయిందని చెప్పారు. వీరి పెళ్లి స్థానికంగా హాట్ టాపిక్ కాగా.. సోషల్ మీడియాలో మాత్రం వైరల్ గా మారింది.