ఆంధ్రప్రదేశ్లోకి నైరుతీ రుతుపవనాలు ప్రవేశించాయి. దీంతో ఎండ వేడి నుంచి ప్రజలకు కాస్త ఊరట లభించింది. వర్షాలు సైతం కొన్ని ప్రాంతాల్లో భారీగా కురుస్తుండటంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.
Monsoon : ఎండ వేడితో అట్టుడికిపోతున్న ప్రజలకు స్వాంతన లభించింది. నైరుతీ రుతుపవనాలు(SOUTHWEST MONSOON) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఇవి రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో విస్తరించాయి. ఫలితంగా నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు, మూడు రోజుల్లో నైరుతీ రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని అన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. జూన్లో సాధారణం కంటే అత్యధికంగా వర్షాలు పడే అవకాశం ఉంది.
ఈ రుతుపవనాల ఫలితంగా రాయలసీమలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లోని ఇతర జిల్లాల్లోనూ చెదురు మదురుగా వానలు కురుస్తున్నాయి. దీంతో వాతావరణం కాస్త చల్లబడింది. సోమ, మంగళవారాల్లో ఆంధ్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. అలాగే మంగళవారం తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, సత్యసాయి, అల్లూరి, పార్వతీపురం మన్యం తదితర జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయని ఐఎండీ వెల్లడించింది.
రుతుపవనాల ప్రభావం వల్ల ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో రికార్డైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో 47.7 మి.మీ, తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో 53.7 మి.మీ, అల్లూరి జిల్లా అనంతగిరిలో 22 మి.మీ, పుంగనూరులో 33 మి.మీ, కాకినాడ జిల్లా పెదపూడిలో 20.2 మిల్లీ మీటర్లు చొప్పున వర్షపాతం నమోదైంది.