»We Will Defeat Bjp And Brs Parties Mallikarjuna Kharge
Congress Party: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను గద్దెదించుతాం: మల్లికార్జున ఖర్గే
తెలంగాణ రావడానికి కారణం సోనియా గాంధీ అని, కానీ ఆమెకు దక్కాల్సిన క్రెడిట్ కేసీఆర్ తీసుకున్నారని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. బీజేపీని, బీఆర్ఎస్ను అసెంబ్లీ ఎన్నికల్లో గద్దెదించుతామని ధీమా వ్యక్తం చేశారు.
ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను గద్దెదించి కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. శనివారం చేవెళ్ల కేవీఆర్ మైదానంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాగర్జన సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కేంద్రంలో బీజేపీని, తెలంగాణలో బీజేపీకి మద్దతిస్తున్న బీఆర్ఎస్ను గద్దెదించుతామని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ను, లోక్ సభ ఎన్నికల్లో మోదీని ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణ కోసం అన్ని వర్గాల ప్రజలు పోరాటం చేసినా క్రెడిట్ మాత్రం ఒక్కరే తీసుకున్నారని అన్నారు. ప్రజల మనసు తెలిసి సోనియా తెలంగాణ ఇస్తే ఆ క్రెడిట్ మాత్రం కేసీఆర్ తీసుకున్నారన్నారు. తొమ్మిదేళ్లలో కేసీఆర్ రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. కేసీఆర్‌ను సాగనంపేందుకు ప్రజలు సిద్ధమైనట్లు తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 12 సూత్రాలను అమలు చేయనున్నట్లు తెలిపారు. కర్ణాటకలో ఐదు హామీలు ఇచ్చామని, వాటిని ఇప్పుడు నెరవేరుస్తున్నట్లు వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 4వేల కిలో మీటర్లు పాదయాత్ర చేశారన్నారు. తాను 12 ఎన్నికలలో పోటీ చేసి 11సార్లు గెలిచానని, ప్రజాస్వామ్య దేశం వల్లే తాను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని అయ్యానని ఖర్గే చెప్పుకొచ్చారు. దేశ ఐక్యతకు కృషి చేస్తూ ఇందిర, రాజీవ్‌లు ప్రాణాలొదిరారని, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కలిసి చిన్నచిన్న రాజ్యాలను కలిపినట్లు గుర్తు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని, అందుకే బీఆర్ఎస్ పైన బీజేపీ గట్టిగా విమర్శలు చేయడంలేదన్నారు.