»Watch Eo Swimming While Abhishekam Time In Neelakanteshwara Temple Nizamabad
Watch: ఆలయంలో అపచారం.. అభిషేకం వేళ పుష్కరిణి ఈత కొట్టిన ఈవో
మొదటి నుంచి ఈవో వేణు తీరు వివాదాస్పదంగా ఉంది. ఆలయంలో భక్తుల పట్ల దురుసుగా ప్రవర్తించడం.. సిబ్బందితో గొడవలు చోటుచేసుకున్నాయని తెలుస్తోంది. దేవాదాయ శాఖ అధికారులు విచారణకు ఆదేశించినట్లు సమాచారం.
ఆయన ఆలయానికి ((Temple) పాలన అధికారి. ఆలయంలో జరుగాల్సిన కార్యక్రమాలపై ఉద్యోగులు, భక్తులకు ఆదేశాలు జారీ చేసే వ్యక్తి. ఇలా చేయొద్దు అని చెప్పాల్సిన అధికారే అపచారానికి ఒడిగట్టారు. పవిత్రమైన అభిషేకం జరుగుతుండగా పుష్కరిణిలో అధికారి జలకాలాడాడు. పూజారులు, భక్తులు వద్దని వారించినా వినకుండా అలానే ఈత కొట్టాడు. దీంతో అధికారి తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ సంఘటన నిజామాబాద్ (Nizamabad)లో చోటుచేసుకుంది.
నిజామాబాద్ లోని నీలకంఠేశ్వర ఆలయం (Neelakanteshwara Temple) దక్షిణ కాశీగా పేరొందింది. ఈ ఆలయ ఇన్ చార్జ్ ఎండోమెంట్ ఆఫీసర్ (Endowment Officer)గా వేణు ఉన్నారు. ఈ ఆలయంతో పాటు మరో మూడు ఆలయాలకు ఈవోగా పని చేస్తున్నారు. గురువారం ఆలయ ఆవరణలోని పుష్కరిణిలో పూజారులు (Priests) నీలకంఠేశ్వర స్వామికి అభిషేకం (Abhishekam) కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఉత్సవ విగ్రహాలకు వేద మంత్రోచ్ఛరణల మధ్య పూజ చేస్తుండగా ఈవో వేణు పుష్కరిణిలో ఈత (Swimming) కొడుతూ కనిపించారు. అంతేకాకుండా విగ్రహాలకు సమీపంగా వచ్చి జలకాలాడారు.
ఇలా చేయడం అపచారం అని పూజారులు వారిస్తున్నా వినలేదు. అలాగే ఈత కొడుతూ ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ (Viral)గా మారింది. ఈవో తీరుపై భక్తులు (Devotees) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అధికారి ఇలా చేయడం దారుణమని మండిపడుతున్నారు. కాగా, ఈ సంఘటన ఈనెల 17వ తేదీన జరిగిందని తెలిసింది. మాస శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న క్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈవో తీరుపై దేవాదాయ శాఖ అధికారులు విచారణకు ఆదేశించినట్లు సమాచారం. కాగా మొదటి నుంచి ఈవో వేణు తీరు వివాదాస్పదంగా ఉంది. ఆలయంలో భక్తుల పట్ల దురుసుగా ప్రవర్తించడం.. సిబ్బందితో గొడవలు చోటుచేసుకున్నాయని తెలుస్తోంది. అతడిని సస్పెండ్ (Suspend) చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.