»107 People Who Lost The Opportunity To Contest In Telangana Elections 68 In Nizamabad Alone
Election Commission: తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోయిన 107 మంది..!
కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణలోని 107 మందిపై అనర్హత వేటు వేస్తూ ప్రకటన విడుదల చేసింది. గత ఎన్నికల్లో ఖర్చులకు సంబంధించిన వివరాలను సమర్పించకపోవడం వల్ల వారిపై చర్యలు తీసుకున్నట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది.
తెలంగాణకు చెందిన 107 మంది అభ్యర్థులపై వేటు పడింది. కేంద్ర ఎన్నికల సంఘం వారిపై వేటు వేసింది. గత ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు వారంతా పోటీ చేసినప్పుడు తమ ఖర్చుకు సంబంధించిన వివరాలు సమర్పించలేదు. దీంతో వారిని కేంద్ర ఎన్నికల సంఘం అనర్హులుగా ప్రకటించి వేటు వేసింది. వారిలో 72 మంది లోక్ సభ స్థానాల్లో పోటీ చేయడం విశేషం. ఎలక్షన్ కమిషన్ వేటుకు గురైన వారిలో ఒక్క నిజామాబాద్ లోక్ సభ నియోజకర్గానికి చెందినవారే 68 మంది ఉన్నట్లు ఈసీ వెల్లడించింది.
మిగిలిన వారిలో మెదక్, మహబూబాబాద్ నుంచి ఒక్కొక్కరు, నల్గొండ లోక్ సభ స్థానం నుంచి ఇద్దరు ఉండగా వారిపై అనర్హత వేటు పడింది. అలాగే అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి అనర్హత వేటుకు గురైన వారు 35 మంది ఉన్నట్లు ఈసీ వెల్లడించింది. ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 10ఏ కింద వారందరిపైనా అనర్హత వేటు వేసినట్లు ఎలక్షన్ కమిషన్ తెలిపింది.
ఈ అనర్హత వేటు 2021 జూన్ నుంచి వర్తించనుందని, 2024 జూన్ వరకు వీరు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఎన్నికల్లో పోటీ చేసిన వారు, ఎన్నికల్లో తమ ఖర్చుకు సంబంధించిన వివరాలను ఈసీకి సమర్పించాల్సి ఉండగా అలా సమర్పించనివారిపై ఈసీ సెక్షన్ 10ఏ కింద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఆ వివరాలు సమర్పించకపోవడం వల్లే ఈసీ అనర్హత వేటు వేస్తూ ఈ కీలక ప్రకటన చేసింది.