తెలంగాణ ప్రభుత్వానికి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య విబేధాలు రచ్చకెక్కాయి. గవర్నర్, ప్రభుత్వం మొండి పట్టు పట్టడంతో తెలంగాణలో సంప్రదాయం ప్రకారం జరుగాల్సిన కార్యక్రమాలు కట్టు తప్పాయి. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఫక్తూ ఓ పార్టీ నాయకురాలిగా వ్యవహరించడం.. బిల్లులకు ఆమోదం తెలపకపోవడం వంటి వాటితో రాష్ట్ర ప్రభుత్వం కినుక వహించింది. అందుకే గవర్నర్ కుర్చీకి కనీస గౌరవం ఇవ్వడం లేదు.
అసలు రాష్ట్రంలో గవర్నర్ వ్యవస్థ ఉన్నట్టు కూడా భావించడం లేదు. రాజ్ భవన్ పాత్రను పూర్తిగా తగ్గించేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించింది. గణతంత్ర వేడుకలు కుదించడం, బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఎత్తివేయడం వంటి పరిణామాలు రెండు రాజ్యాంగ వ్యవస్థల మధ్య వివాదం తారస్థాయికి తీసుకెళ్లింది. అయితే ఈ వివాదం హైకోర్టు చేరడంతో దేశవ్యాప్త చర్చకు దారి తీసింది. మూడో రాజ్యాంగ వ్యవస్థ అయిన న్యాయస్థానం ఈ రెండు వ్యవస్థల మధ్య తలదూర్చలేనని స్పష్టం చేసింది. కానీ సలహాలు మాత్రం ఇచ్చింది.
న్యాయస్థానం కొంత రాజ్ భవన్ కు అనుకూలంగా వ్యవహరించడంతో ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దిగి రాక తప్పలేదు. అందుకే గణతంత్ర వేడుకల్లో రాజ్ భవన్ కే పరిమితం చేసినా కోర్టు సూచనల మేరకు పరేడ్ తప్పనిసరిగా నిర్వహించాల్సి వచ్చింది. రాజ్ భవన్ లో జరిగిన వేడుకలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ తదితర ఉన్నత అధికారులు విధి లేక హాజరయ్యారు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి మొదటి ఎదురు దెబ్బ కాగా.. తాజాగా బడ్జెట్ సమావేశాల విషయంలో మరో ఎదురు దెబ్బ తగిలింది. కోర్టు సూచనల మేరకు ప్రభుత్వం దిగి వచ్చింది.
రాజ్యాంగంలోని లొసుగులను తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలను గవర్నర్ ప్రసంగం లేకుండానే నిర్వహించాలనే పట్టుదలతో వెళ్లింది. రెండేళ్లు అలాగే నిర్వహించింది. అయితే తనను పట్టించుకోకపోవడం, ప్రొటోకాల్ ను నిర్లక్ష్యం చేయడం వంటి వాటితో ఆగ్రహం మీద ఉన్న గవర్నర్ తన విశేష అధికారాలను ప్రయోగించారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు తన వద్దే పెట్టుకోవడం, ఇటీవల వార్షిక బడ్జెట్ కు ఆమోదం తెలుపకపోవడం వంటి వాటితో రాష్ట్ర ప్రభుత్వం ఇరుకున పడింది. న్యాయస్థానం ద్వారా గవర్నర్ తీరు మారుతుందనే ఆశతో వెళ్లగా అక్కడ భంగపాటు ఎదురైంది.
ధర్మాసనం కూర్చొని మాట్లాడుకోవాలని హితవు పలకడంతో రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చింది. గవర్నర్ ప్రసంగంతోనే బడ్జెట్ సమావేశాలు ప్రారంభిస్తామని, బిల్లులు ఆమోదం తెలిపాలే గవర్నర్ కు సూచించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. రాజ్ భవన్, ప్రభుత్వ న్యాయవాదుల మధ్య సయోధ్య కుదరడంతో ప్రస్తుతానికి గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదం సద్దుమణిగింది. అనంతరం వ్యవహారాలు చకచకా మారిపోయాయి.
శాసన సభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆగమేఘాల మీద గవర్నర్ తమిళిసైని కలిసి బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగించాల్సిన కోరారు. అనంతరం శాసనసభ, మండలి అధికారులు గవర్నర్ తో సమావేశమయ్యారు. ఇలా చకచకా వ్యవహారాలు జరిగిపోయాయి. అయితే బడ్జెట్ సమావేశాలు కొనసాగాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది. ఏది ఏమైనా న్యాయస్థానం రంగంలోకి దిగడంతో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురు దెబ్బలు తగిలాయి. ఇక పోలీస్ ఉద్యోగాల భర్తీ విషయంలో కూడా కోర్టు తీర్పు వలనే అదనంగా ఏడు మార్కులు కలపాల్సి వచ్చింది. ఇప్పుడు మరికొందరికి ఈవెంట్స్ నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది.