తెలంగాణలో గవర్నర్ కు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వివాదం తారస్థాయికి చేరింది. వార్షిక బడ్జెట్ ను శాసనసభ, మండలిలో ప్రవేశపెట్టేందుకు ఇంకా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అనుమతి ఇవ్వలేదు. బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ప్రారంభం కానుండగా.. బడ్జెట్ ప్రతిపాదనలు, సిఫారసులతో సమావేశాల్లో ప్రవేశపెట్టాలి. కానీ దీనికి గవర్నర్ నుంచి ఇంకా ఆమోదం లభించలేదు. దీనిపై హైకోర్టుకు వెళ్లే ఆలోచనలు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నది.
2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేసిన ప్రభుత్వం గవర్నర్ సిఫారసుల కోసం రాజ్ భవన్ కు పంపించింది. అయితే గవర్నర్ పుదుచ్చేరిలో ఉండడంతో ఈ ప్రతిపాదనలు హైదరాబాద్ లోని రాజ్ భవన్ కే పరిమితమయ్యాయి. ఆమె ఉద్దేశపూర్వకంగా ఆమోదం తెలపడం లేదని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తున్నది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం ఉండాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం మంగళం పాడింది. గవర్నర్ ప్రసంగం లేకుండానే శాసనసభ సమావేశాలు నిర్వహించాలనే పట్టుదలతో ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో గవర్నర్ తన విశేష అధికారాలను ఉపయోగించుకుని బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం తెలపడం లేదని తెలుస్తున్నది. ఇంకా నాలుగు రోజుల సమయం ఉండడంతో గవర్నర్ ఎప్పుడు ఆమోదం తెలుపుతారనేది ఉత్కంఠగా మారింది.
హైకోర్టుకు ప్రభుత్వం
గవర్నర్ ఆమోదం తెలుపకపోతే ఎలా అనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం సమాలోచనలు చేసింది. బడ్జెట్ కు ఆమోదం తెలపకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించాలనే ఆలోచన ప్రభుత్వం చేస్తోంది. దీనిపై సోమవారమే హైకోర్టులో గవర్నర్ తీరుపై పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. కొన్ని నెలలుగా బిల్లులు అంటిపెట్టుకుని ఉండడం.. ఇప్పుడు బడ్జెట్ కు ఆమోదం తెలపకపోవడం వంటి వాటిని న్యాయస్థానానికి వివరించే అవకాశం ఉంది.