»Telangana 100 Crore Assets Found In Government Official Shiva Balakrishna House
Shiva Balakrishna : అక్రమాస్తుల కేసు.. హెచ్ ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అరెస్ట్
తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (TSRERA) కార్యదర్శి, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఇంట్లో సోదాలు జరిగాయి.
Shiva Balakrishna : తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (TSRERA) కార్యదర్శి, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (HMDA) మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఇంట్లో సోదాలు జరిగాయి. ఆ అధికారికి హైదరాబాద్ నగరంలోని ఓ పాష్ ఏరియాలో విలాసవంతమైన బంగ్లా ఉంది. ఆ ఇల్లు చూస్తుంటే అది ఓ అధికారి బంగ్లా అని అనిపించక మానదు. 14 ఏసీబీ బృందాలు అధికారుల వద్దకు చేరుకున్నాయి. బంగ్లాను చూసి ఏసీబీ అధికారులు ఆశ్చర్యపోయారు. పలు రియల్ ఎస్టేట్ కంపెనీలకు అనుమతులు ఇప్పించడం ద్వారా బాలకృష్ణ కోట్లాది రూపాయలు సంపాదించినట్లు ఏసీబీ ప్రాథమిక విచారణలో వెల్లడైంది. మార్కెట్ విలువ ప్రకారం 300 నుంచి 400 కోట్ల రూపాయల ఆస్తులుగా గుర్తించారు. నగలు నగదు ఆస్తుల పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నానక్ రామ్ గూడలోని బాలకృష్ణ ఇంట్లో 84 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకోగా.. హైదరాబాద్ లో విల్లాలు, ఫ్లాట్లతో పాటుగా శివారు ప్రాంతాల్లో ఎకరాల కొద్దీ ల్యాండ్ ఉన్నట్లు గుర్తించారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 100 ఎకరాల ల్యాండ్ పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
మొత్తం 20 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. బాలకృష్ణ ఇంటితో పాటు బంధువులు, మిత్రులు కంపెనీలో సోదాలు చేస్తున్నారు. దాదాపు రెండు కిలోల పైచిలుకు బంగారు ఆభరణాలు భారీగా వెండి స్వాధీనం చేసుకోగా.. 80కి పైగా అత్యంత ఖరీదైన వాచీలు.. పెద్ద మొత్తంలో ఐఫోన్లను అధికారులు సీజ్ చేశారు. కొడకండ్లలో 17 ఎకరాలు, కల్వకుర్తిలో 26 ఎకరాలు, యాదాద్రిలో 23 ఎకరాలు, జనగామలో 24 ఎకరాలకు సంబంధించిన పత్రాలు స్వాధీన పరుచుకున్నారు. భూములు అన్ని కూడా బినామీల పేర్ల మీద ఉన్నట్లు గుర్తించారు. అలాగే, బాలకృష్ణ బినామీలను కూడా ప్రశ్నిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. శివ బాలకృష్ణను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు కోర్టులో హాజరుపరచనున్నారు. బుధవారం ఉదయం 5 గంటల నుంచి బాలకృష్ణకు చెందిన 20 చోట్ల ఏసీబీ దాడులు ప్రారంభించింది. హెచ్ఎండీఏ, రెరా కార్యాలయాల్లో ఏసీబీ బృందాలు సోదాలు నిర్వహించగా, బాలకృష్ణ ఇళ్లు, ఇతర కీలక ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. అతనిపై లెక్క చూపని సంపద కేసు నమోదైంది. తన పదవిని దుర్వినియోగం చేసి పెద్ద ఎత్తున సంపద కూడబెట్టారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలకృష్ణ రూ.200 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అనుమానిస్తోంది. శివబాలకృష్ణ ఇంట్లో రెండో రోజు ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఆయన బ్యాంక్ లాకర్లు, ఇతర అప్రకటిత ఆస్తులపై ఏసీబీ దర్యాప్తు చేస్తోంది. ఈరోజు కుటుంబ సభ్యుల సమక్షంలో ఏసీబీ అధికారులు బ్యాంకు లాకర్‌ను తెరవనున్నారు.