ఓ ఫోటోగ్రాఫర్ తనకు గిరాకీ సరిగా రావడం లేదని వినూత్నంగా ఆలోచించాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం టమాటా రేటుకు ఉన్న డిమాండ్ క్యాచ్ చేసుకుని సరికొత్త ఆఫర్ ప్రకటించాడు. తన షాపులో ఫొటో దిగిన వారికి టమాటాలు ఫ్రీగా ఇస్తానని వెల్లడించాడు. అంతేకాదు పలు చోట్ల ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశాడు. దీంతో అనేక మంది కస్టమర్లు అతని షాపుకు రావడం మొదలయ్యారు. అయితే ఇది ఎక్కడ ఏర్పాటు చేశారో ఇప్పుడు చుద్దాం.
కొత్తగూడెం(kothagudem)లోని ఓ ఫోటోగ్రాఫర్ వేముల ఆనంద్ తన షాపుకు కస్టమర్లను పెంచుకోవాలని సరికొత్తగా ఆలోచించాడు. ప్రస్తుతం మార్కెట్లో టమాటా రేట్లు ఎక్కువగా ఉండటాన్ని గమనించి వాటిని ఎలాగైనా కస్టమర్లకు అందజేయాలని భావించాడు. ఆ క్రమంలో తన స్టూడియోలో పాస్పోర్ట్ ఫోటోలు తీసుకున్న వారికి పావుకిలో టమటాల ప్యాకెట్ ను ఫ్రీగా ఇస్తామని ఆఫర్ ప్రకటించాడు. అంతేకాదు పలు చోట్ల ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసి ప్రజలకు తెలిసేలా చేశాడు. ఇది చూసిన జనాలు అతని స్టూడియోకు రావడం మొదలు పెట్టారు.
అయితే ఇటీవల జిల్లా కలెక్టరేట్ కొత్తగూడెంలో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పాల్వంచ సమీపంలోని జిల్లా కార్యాలయాల సముదాయానికి మార్చబడ్డాయి. దీంతో బస్టాండ్ సెంటర్లో చాలా మంది వ్యాపారంతో పాటు తన వ్యాపారం చాలా వరకు తగ్గిందని షాపు యాజమాని ఆనంద్(anand)అన్నారు. అయితే కార్యాలయాలు మారక ముందు తన స్టూడియోకు రోజూ 20 నుంచి 30 మంది కస్టమర్లు వచ్చేవారన్నారు. ఆ నేపథ్యంలో కస్టమర్లను ఎలా పెంచుకోవాలని ఆలోచించిన క్రమంలో టమాటాల ఆలోచన వచ్చినట్లు ఆయన వెల్లడించారు. అయితే ఎనిమిది పాస్పోర్ట్ ఫోటోల(passport photos)సెట్ తీయడానికి 100 రూపాయలు ఖర్చవుతుందని చెప్పారు. ప్రస్తుతం మార్కెట్లో టమాటాల ధర రూ.200 పలుకుతుండడంతో తాను 50 రూపాయల విలువైన పావు కిలో టమాటా ప్యాకెట్ ఇస్తున్నట్లు ఆనంద్ స్పష్టం చేశారు.