JGL: ధర్మపురి స్వామివారి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించిన సందర్భంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావును హైదరాబాద్‌లోని ఆయన కార్యాలయంలో దేవస్థాన కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్వామివారి శేష వస్త్రం, ప్రసాదం అందజేసి కమిషనర్‌ను సన్మానించారు. ఆలయ ఉత్సవాల నిర్వహణపై వివరాలు తెలియజేశారు.
MBNR: హన్వాడలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంను (కేజీబీవీ) డీఈవో సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యా ప్రమాణాలు, వసతులు, శుభ్రత, ఆహార నాణ్యత తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు. విద్యార్థులతో ముచ్చటించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి ఆహార నాణ్యతను పరిశీలించారు.
RR: వికారాబాద్ జిల్లా నూతన కలెక్టర్ దీపక్ తివారిని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. చేవెళ్ల నియోజకవర్గం, నవాబు పేట్ మండలంలో అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో కొనసాగుతున్న, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై చర్చించారు.
NRML: రాబోయే గోదావరి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. బాసర జ్ఞాన సరస్వతి దేవాలయం వద్ద భక్తుల రద్దీ దృష్ట్యా ఘాట్లు, తాగునీరు, మరుగుదొడ్లు, పార్కింగ్ వంటి సదుపాయాలు కల్పించనున్నట్లు చెప్పారు. సోమవారం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏర్పాట్లపై సమీక్షించారు.
GDWL: స్త్రీనిధి రుణాలను పొందిన మహిళలు ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. సోమవారం గద్వాల కలెక్టరేట్‌లో స్త్రీనిధి పథకం ద్వారా రూ.3 లక్షల రుణంతో కొనుగోలు చేసిన ఎలక్ట్రిక్ ఆటోలను ఆయన ప్రారంభించారు. ఈ వాహనాలను ఉండవెల్లి మండలం చిన్న ఆముదాలపాడు గ్రామానికి చెందిన లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
SRD: సంగారెడ్డి పట్టణంలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సోమవారం ఉపేందర్ రెడ్డి నేతృత్వంలోని ఉస్మానియా ప్రతినిధి బృందం అకస్మికంగా తనిఖీ చేసింది. కళాశాలలో పనిచేస్తున్న రెగ్యులర్, గెస్ట్ ఫ్యాకల్టీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. వివిధ కోర్సుల నిర్వహణపై సమీక్షించి, విద్యా ప్రమాణాల మెరుగుదలకు పలు సూచనలు చేశారు.
NGKL: జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో బాధితుల నుంచి 9 అర్జీలను స్వీకరించినట్లు ఎస్పీ సంగ్రామ్ జి పాటిల్ తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజల ద్వారా ఎస్పి నేరుగా ఫిర్యాదులను స్వీకరించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అర్జీలను పరిశీలించి బాధితులకు సత్వర న్యాయం చేకూర్చాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు.
MDCL: వేగవంతమైన పట్టణీకరణ వల్ల భూ వనరులపై ఒత్తిడి పెరిగిందని HYDRAA కమిషనర్ రంగనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. విలువైన జలాశయాలు అక్రమ ఆక్రమణలకు గురవుతున్నాయని తెలిపారు. JNTUHలో ప్రపంచ నీటి దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. దాదాపు 16 శాతం జలాశయాలు ఆక్రమణలకు గురయ్యాయని వెల్లడించారు. ప్రతి ఒక్కరు వాటిని కాపాడాలని పిలుపునిచ్చారు.
WGL: నెక్కొండ మండల తాహసీల్దార్‌కు శ్రీరామ్ దళ్ తెలంగాణ శాఖ వినతి పత్రం అందజేశారు. అనంతరం సంఘ నాయకుడు వినయ్ రెడ్డి మాట్లాడుతూ.. సర్వే నంబర్ 6, 66లో ఉన్న దేవాదాయ భూములపై అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే వాటిని తొలగించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. దేవాలయ ఆస్తుల రక్షణ సమాజ బాధ్యత అని పేర్కొంది.
ADB: ఎన్నికల్లో గెలిచిన, ఓడిన ప్రజా సమస్యల పరిష్కారానికి అలుపెరుగని కృషి చేయాలని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని ప్రజాసేవ భవన్‌లో కాంగ్రెస్ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తను పార్టీ గుర్తిస్తుందని పేర్కొన్నారు.
BDK : కొత్తగూడెం జిల్లా రామవరం కృషి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన కిసాన్ మేళాలో జిల్లా కలెక్టర్ అంకిత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు సంప్రదాయ పద్ధతులకు స్వస్తి పలికి, ఆధునిక సాంకేతికత మరియు శాస్త్రీయ విధానాలతో దిగుబడులు పెంచుకోవాలని సూచించారు. పంట మార్పిడి, పశుసంవర్ధక రంగంపై దృష్టి సారించి ఆదాయాన్ని పెంపొందించుకోవాలని కోరారు.
MNCL: బెల్లంపల్లి బార్ అసోసియేషన్ ఎన్నికలు ఈనెల 30న నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి శ్రీనివాస్ సోమవారం ప్రకటనలో తెలిపారు. 2026-27 సంవత్సరానికి నిర్వహించనున్న బార్ అసోసియేషన్ ఎన్నికలలో అధ్యక్షుడిగా రవికుమార్, శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా కుమార్, సునీల్ కుమార్, మిగతా అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ అసోసియేషన్‌లో 58 ఓట్లు నమోదయ్యాయని వెల్లడించారు.
SDPT: మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై సమత హెచ్చరించారు. బుధవారం మిరుదొడ్డి మండలం అల్వాల చెప్పాల కూడలి వద్ద వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాహనదారులు తప్పనిసరిగా లైసెన్స్,ఆర్సీ కలిగి ఉండాలని,హెల్మెట్ ధరించాలని సూచించారు.
BHPL: CEIR పోర్టల్ ద్వారా పోగొట్టుకున్న సెల్ ఫోన్లను పోలీసులు తక్కువ సమయంలోనే రికవరీ చేసి బాధితులకు అందజేశారు. బొడ్డు మహేష్, సమ్మయ్య అనే ఇద్దరు వ్యక్తులు తమ ఫోన్లు పోగొట్టుకోగా BHPLసీఐ నరేష్ ఆధ్వర్యంలో వాటిని గుర్తించి ఇవాళ అప్పగించారు. ఫోన్లు పోగొట్టుకున్న వారు వెంటనే www.ceir.gov.in వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని సీఐ సూచించారు.
JN: కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఇవాళ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను ఆయన స్వయంగా స్వీకరించారు. ప్రజా సమస్యలకు అధికారులు ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమానికి 207 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు.