MDCL: ఉప్పల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వాణిజ్య శాస్త్రం, కంప్యూటర్ అప్లికేషన్స్ శాఖల ఆధ్వర్యంలో ‘ఏఐ ఇన్ బిజినెస్’ స్వల్పకాలిక సర్టిఫికేట్ కోర్సును ప్రిన్సిపాల్ డా. కె.విజయ్ కుమార్ ఇవాళ ప్రారంభించారు. సమన్వయ కర్తలుగా డా.సత్యనారాయణ, డా.యమునారాణి వ్యవహరిస్తారని పేర్కొన్నారు. ఆధునిక ఉపాధి అవకాశాలకు ఇది ఎంతో ఉపయోగకరమని, ఈ కోర్సు వారం రోజులపాటు ఉంటుందని ఆయన తెలిపారు.
VKB: అనంతగిరిలో పుట్టిన మూసీ నది మానవ నిర్లక్ష్యంతో క్రమంగా కనుమరుగైపోతోంది. అక్రమ ఇసుక తవ్వకాలు, రసాయన కాలుష్యం, నీటి వనరుల దుర్వినియోగంతో నది ఉనికి ప్రమాదంలో పడింది. జీవనదులు కేవలం నీటి వనరులు మాత్రమే కాదు.. ప్రకృతి సమతుల్యతకు, భవిష్యత్ తరాల జీవనానికి ఆధారం. ఇప్పటికైనా రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి మూసీ పరిరక్షణకు కట్టుబడాలి.
MNCL: కూలి పనులకు వెళ్లిన ఓ మహిళ విద్యుత్ షాక్‌కి గురై మరణించినట్లు SI రాజశేఖర్ తెలిపారు. జైపూర్ మండలం పౌనూరు గ్రామానికి చెందిన అఖిల(27) పొలంలో కలుపు తీస్తుండగా, విద్యుత్ మోటార్ ఇనుప పైపును తాకింది. దీంతో అక్కడికక్కడే స్పృహ కోల్పోగా, ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల కేంద్రంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. వీరభద్రేశ్వర స్వామి ఆలయానికి చెందిన లేగదూడను శనివారం రాత్రి గుర్తుతెలియని ట్రాక్టర్ ఢీకొనడంతో అది అక్కడికక్కడే మృతి చెందింది. విగతజీవిగా పడి ఉన్న బిడ్డను చూసి తల్లి ఆవు “అంబా.. అంబా..” అంటూ అరుస్తూ రాత్రంతా చుట్టూ తిరగడం స్థానికులను కంటతడి పెట్టించింది.
PDPL: మంథని మున్సిపాలిటీ పరిధిలోని గంగాపురి 4వ వార్డులో కోతుల బెడద, సంచారం తీవ్రతరమైంది. కోతులను నిర్బంధించి, నివారించేందుకు వార్డు కౌన్సిలర్ మద్దికట్ల స్రవంతి గ్రామంలో కోతులు సంచరించే ప్రాంతంలో బోను ఏర్పాటు చేయించారు. మార్చి 12న గడిపెళ్లి మంగళ, 14న కొండ రాజయ్యపై కోతి మూకలు దాడి చేసి గాయపరచడంతో ఆసుపత్రి పాలయ్యారు. కోతుల బెడద లేకుండా చేస్తామన్నారు.
MHBD: మరిపెడ మున్సిపాలిటీలో 2026–27 సంవత్సరానికి గాను తైబజార్, పశువుల సంత అంగడీ వేలం ఈ నెల 19న నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ విజయానంద్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. వేలంలో పాల్గొనేవారు రూ. 3 వేల చెల్లించి దరఖాస్తు ఫారం పొందాలని, రూ.3.50 లక్షల డిపాజిట్ నిర్ణయించినట్లు చెప్పారు. దరఖాస్తులను ఈ నెల 18లోపు కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.
HYD: బైరమాల్‌గూడ ఫ్లై ఓవర్ కింద ‘స్పోర్ట్స్ అరేనా’ తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఇదే తరహాలో నాయిని నర్సింహా రెడ్డి (స్టీల్ బ్రిడ్జి) కింద కూడా ఏర్పాటు చేయాలని స్థానిక యువత కోరుతుంది. అజామాబాద్ సిగ్నల్ వద్ద బ్రిడ్జి కింద ఖాళీ స్థలంలో బాక్స్ క్రికెట్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. పక్కనే ఉన్న పార్క్‌కు వచ్చే వారి కోసం బ్యాట్మింటన్ కోర్టు పెడితే బాగుంటుందన్నారు.
MHBD: ఇనుగుర్తి మండలంలోని కోమటిపల్లి గ్రామానికి చెందిన విలాసాగర్ మురళి (46) తనకు ఉన్న 20 గుంటల భూమిని అమ్ముకొని ఇళ్లు నిర్మించుకున్నాడు. ఈ విషయంపై ఆదివారం భార్యాభర్తలు గొడవ పడ్డాడు. దీంతో మనస్థాపం చెందిన మురళి పురుగుల మందు తాగడంతో గమనించిన కుటుంబ సభ్యులు మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.
NZB: బాల్కొండ మండల కేంద్రంలోని పద్మశాలి సంఘ నూతన కార్యవర్గాన్ని ఆదివారం సాయంత్రం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘ అధ్యక్షుడిగా అందే వెంకట గిరి, ఉపాధ్యక్షుడిగా భూస రత్నాకర్, సెక్రటరీగా మ్యాక నాగేశ్, కోశాధికారిగా కుందారం శ్రీనివాస్ ఎన్నికయ్యారు. పద్మశాలిల అభివృద్ధికి కృషి చేస్తామని నూతన సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు, కుల పెద్దలు పాల్గొన్నారు.
JN: పట్టణ కేంద్రంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ (గర్ల్స్)లో ఈనెల 18న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల HM సంధ్యారాణి ఇవాళ తెలిపారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, PG పూర్తి చేసిన విద్యార్థులు ఉదయం 9 గంటల లోపు అర్హత పత్రాలతో జాబ్ మేళాకు హాజరు కావాలని సూచించారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
HNK: కాజీపేట పట్టణ కేంద్రంలోని రైల్వే స్టేషన్‌లో ఆదివారం అర్ధరాత్రి SI శివకుమార్ ఆధ్వర్యంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు రైల్వే స్టేషన్ లోని పలు ప్రాంతాలను, అనుమానితుల బ్యాగులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం SI మాట్లాడుతూ.. అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.
NRPT: కృష్ణ మండలం ఖాన్‌దొడ్డి గ్రామ శివారులో పోలీసుల గస్తీ సమయంలో అనుమతులు లేకుండా మొరం తరలిస్తున్న టిప్పర్‌ను స్వాధీనం చేసుకున్నారు. వాహన యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారని ఎస్ఐ నవీద్ తెలిపారు. ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా మొరం రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
KMM: ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ ప్రభుత్వ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య మామిళ్ళగూడెం ప్రాంతంలో క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించారు. నగర పాలనను బలోపేతం చేసే లక్ష్యంతో అక్కడ కొనసాగుతున్న ఇంటి పన్ను వసూళ్ల ప్రక్రియను ఆయన స్వయంగా సమీక్షించారు. పన్ను వసూళ్లు వేగవంతం చేయాలని, పౌర సేవలను మెరుగుపరచాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఉమ్మడి WGL జిల్లా ప్రజల చిరకాల కోరికైన మామునూరు ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి జూన్ నెలలో శంకుస్థాపన చేయడానికి కసరత్తు చేస్తుంది. ఈ ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముఖ్యఅతిథిగా PM నరేంద్ర మోదీని ఆహ్వానించినట్లు తెలుస్తుంది. ప్రాజెక్టుకు సుమారు రూ. 850 కోట్లు వ్యయమవుతుందని అంచనా. అయితే ఇప్పటికే ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కావలసిన భూమిని సేకరించిన విషయం తెలిసిందే.
MDK: నిజాంపేట మండలం నందగోకుల్ గ్రామం నుంచి చల్మెడ కమాన్ సుమారు ఏడు కిలోమీటర్ల వరకు రోడ్డు పూర్తిగా కంకర పోసి వదిలేశారు. దీంతో ఇరు గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నిత్యం అధిక సంఖ్యలో ప్రజలు ఈ రోడ్డుపై రామాయంపేటకు వెళ్తూ ఉంటారు. ఈ విషయమై అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేకుండా పోయిందని ఇరు గ్రామాల ప్రజలు వాపోతున్నారు.