• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఫీజు బకాయిలు విడుదల చేయాలని రాస్తారోకో

KNR: పెండింగ్‌లో ఉన్న రూ. 9,500 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో కరీంనగర్ బైపాస్ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొంది. బడ్జెట్‌లో విద్యకు కేవలం 8 శాతం కేటాయించడం అన్యాయమని, ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

March 23, 2026 / 07:06 PM IST

ఇసుక అక్రమ తవ్వకాలపై కఠిన చర్యలు: కలెక్టర్

NGKL: జిల్లాలో అనధికార ఇసుక తవ్వకాలను సహించబోమని కలెక్టర్ బాదావత్ సంతోష్ హెచ్చరించారు. సోమవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీస్ శాఖతో సమన్వయం చేసుకుంటూ పర్యవేక్షణను మరింత బలోపేతం చేయాలని అన్ని శాఖల అధికారులకు సూచించారు.

March 23, 2026 / 07:03 PM IST

పసుపు ధర క్వింటాల్‌కు రూ.11,500

JGL: జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌లో నేడు పసుపు (పిల్ల కొమ్ము) క్వింటాల్ గరిష్ఠ ధర రూ. 11,500, కనిష్ఠం రూ. 8,000, పసుపు (మండ కొమ్ము) గరిష్ఠం రూ. 11,000, కనిష్ఠం రూ. 7,000, మక్కలు గరిష్ఠం రూ. 1,839, కనిష్ఠం రూ.1,622, కందులు గరిష్ఠం రూ. 6,810, కనిష్ఠం రూ. 5,898, అనుములు గరిష్ఠం రూ. 4,925, కనిష్ఠం రూ.4,089, అలసందలు రూ. 7,589, సోయాబీన్ రూ. 3,059గా పలికాయి.

March 23, 2026 / 07:02 PM IST

‘యాసంగి ధాన్యం సేకరణ పకడ్బందీ’

GDWL: జిల్లాలో 2025-26 యాసంగి (రబీ) ధాన్యం సేకరణను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ అధికారులు ఆదేశించారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. దీనికి అవసరమైన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని సూచించారు.

March 23, 2026 / 07:01 PM IST

చెరువుల ఆక్రమణలపై కలెక్టర్ సీరియస్

MBNR: జిల్లాలోని 31 చెరువులు, కుంటలు ఆక్రమణకు గురవుతున్నాయని ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు ప్రభాకర్ కలెక్టర్ కుష్బూ గుప్తాకు ఫిర్యాదు చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్, ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరో మూడు రోజుల్లో క్షేత్రస్థాయిలో ఆక్రమణల తొలగింపు చర్యలు ప్రజలకు స్పష్టంగా కనిపిస్తాయని ఆమె స్పష్టం చేశారు.

March 23, 2026 / 07:01 PM IST

దొంగతనానికి యత్నించిన వ్యక్తి అరెస్ట్

NRPT: మద్దూర్ పట్టణంలోని హనుమాన్ ఆలయంలో హుండీ దొంగతనానికి యత్నించిన ఆవుసుల రమేష్‌ను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు. దామరగిద్ద మండలం మొగల్ మడకకు చెందిన రమేష్ ఆదివారం అర్ధరాత్రి హుండీ పగలగొడుతున్నాడు. ఈ క్రమంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు అతడిని గమనించి అరెస్ట్ చేశారు.

March 23, 2026 / 07:01 PM IST

‘గ్రామాభివృద్ధిలో చురుకైన పాత్ర పోషించాలి’

SRD: ఝరాసంగం మండలంలోని 288 మంది వార్డు సభ్యులకు మూడు విడతలుగా శిక్షణ ఇవ్వనున్నట్లు ఎంపీడీవో మంజుల తెలిపారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో తొలి విడత ఐదు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వార్డు సభ్యులు ప్రభుత్వ పథకాలపై పూర్తి అవగాహన పెంచుకొని ప్రజలకు చేరవేయాలని, గ్రామాభివృద్ధిలో చురుకైన పాత్ర పోషించాలని ఆమె సూచించారు.

March 23, 2026 / 07:00 PM IST

ఎన్నికల హామీ నెరవేర్చిన సర్పంచ్

PDPL: ముత్తారం మండలం పారుపల్లి పంచాయతీ శాత్రాజ్ పల్లి గిరిజన ఆవాసంలో ఏళ్ల తరబడి నెలకొన్న తాగునీటి సమస్యకు పరిష్కారం లభించింది. ఎన్నికల హామీలో భాగంగా సర్పంచ్ చొప్పరి సంపత్ బోరు బావి వేయించారు. మాజీ జడ్పీటీసీ నాయినేని జగన్మోహన్ రావు కొబ్బరికాయ కొట్టి దీనిని ప్రారంభించారు. బోరు సక్సెస్ కావడంతో శాత్రాజ్ పల్లి ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.

March 23, 2026 / 07:00 PM IST

‘అణిచివేతలకు పాల్పడుతున్న కాంగ్రెస్’

WNP: ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ మదనాపురం మండల అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి ఆరోపించారు. హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందస్తు అరెస్టులకు పాల్పడుతుందని ఆయన విమర్శించారు.

March 23, 2026 / 07:00 PM IST

కేసులు పెట్టినా భయపడేది లేదు: మాజీ మంత్రి

ADB: ఆదిలాబాద్ పట్టణంలోని తాంసి బస్టాండ్ సమీపంలో అండర్ బ్రిడ్జి పనులను త్వరగా పూర్తిచేయాలని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. రోడ్డు మార్గంపై లొందలు తవ్వి అలాగే వదిలివేయడంతో పట్టణవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్ పార్టీ పని చేస్తుందని తెలిపారు. కేసులు పెట్టిన భయపడేది లేదని జోగు రామన్న పేర్కొన్నారు.

March 23, 2026 / 07:00 PM IST

రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన తలసాని

HYD: భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా మోండా డివిజన్ ఆదయ్య నగర్‌లో సోమవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రక్తదానం ప్రాణదానం లాంటిదని అన్నారు. రక్తదాతలకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ రక్తాన్ని తలసేమియా బాధితులకు ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

March 23, 2026 / 06:56 PM IST

వైభవంగా శ్రీ వేణుగోపాల స్వామి కళ్యాణం

SRCL: బోయినపల్లి మండలం కొదురుపాక గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి కళ్యాణం సోమవారం వైభవంగా జరిగింది. ఈ కళ్యాణంలో గ్రామ సర్పంచ్ కత్తెరపాక మంజుల సుధాకర్, పాలకవర్గం సభ్యులు, భక్తులు సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని వీక్షించారు.

March 23, 2026 / 06:55 PM IST

ఫిర్యాదులను వెంటనే పరిష్కరించండి: కలెక్టర్

NRPT: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యాన్నిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు. నారాయణపేట కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి సమస్యలు తెలుసుకున్నారు. అర్జీలు పెండింగ్ పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అన్నారు.

March 23, 2026 / 06:52 PM IST

నూతన బార్ అసోసియేషన్ కమిటీ ఎన్నిక

MNCL: లక్షేట్టిపేట బార్ అసోసియేషన్ నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిగా గూడూరి గోవిందా రావు, వేల్పుల సత్యం ఎన్నికయ్యారని ఎన్నికల అధికారి గడికొప్పుల కిరణ్ కుమార్ తెలిపారు. సోమవారం బార్ అసోసియేషన్ నూతన కమిటీ నిర్వహించారు. ప్రధాన కార్యదర్శిగా వేల్పుల సత్యం, ఉపాధ్యక్షులుగా పద్మ, కోశాధికారిగా నగురు రవీందర్, సంయుక్త కార్యదర్శిగా మేదరి పాల్సన్ ఉన్నారు.

March 23, 2026 / 06:47 PM IST

వడదెబ్బపై అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

SRPT: పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ సూచించారు. సోమవారం జరిగిన సమీక్షలో మాట్లాడుతూ.. గ్రామాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. ఆసుపత్రుల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనూ తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. 

March 23, 2026 / 06:43 PM IST