RR: గచ్చిబౌలి, హైటెక్ సిటీ ప్రాంతాల్లో యువత కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆధునిక టెక్నాలజీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అంతర్జాతీయ టెక్నికల్ నిపుణులు మాట్లాడుతూ.. కాలానికి అనుగుణంగా నైపుణ్యాలు పెంపొందించుకోవాలని సూచించారు. కొత్త టెక్నాలజీలను నేర్చుకుంటే ఉద్యోగ అవకాశాలు పెరగడంతో పాటు మంచి పే స్కేల్ సాధించవచ్చని వివరించారు.
HYD: ఉప్పల్ స్టేడియం వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా డిజిటల్ టికెట్ అమలు చేశారు. కోడ్ స్కాన్ చేసి ప్రేక్షకులను లోపలికి అనుమతించినట్లుగా పోలీసులు తెలిపారు. దీని ద్వారా పని చాలా సులువుగా మారిందని అధికారిక యంత్రం తెలిపింది. నేటి మ్యాచ్ నుంచి ఉప్పల్ స్టేడియంలో జరగబోయే మిగతా అన్ని మ్యాచ్‌లకు డిజిటల్ టికెట్ విధానం అమలులో ఉంటుంది.
JGL: మంత్రిగా శ్రీపాద రావు చేసిన సేవలు మరువలేనివని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. సోమవారం ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మంథని ప్రాంతంలోని ధన్వాడలో జన్మించిన శ్రీపాదరావు ప్రజాసేవకే అంకితమయ్యారని కొనియాడారు.
WGL: జిల్లా కలెక్టరేట్‌లో ఇవాళ నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ సత్య శారద పాల్గొన్నారు. ఈ మేరకు ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. అందులో రెవెన్యూ శాఖకు 74, GWMCకి 25, ఇతర శాఖలకు 67 దరఖాస్తులతో కలిపి మొత్తం 166 వినతులు అందయని తెలిపారు. సమస్యలను సంబంధిత అధికారులతో చర్చించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం జూమ్ మీటింగ్ ద్వారా తాహసీల్దార్‌లతో మాట్లాడారు.
PDPL: ధర్మారం మండలంలో అన్ని గ్రామాలలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇవాళ పోలీసులు రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఎస్సై ప్రవీణ్ కుమార్ సూచించారు. మద్యం సేవించి, మొబైల్ మాట్లాడుతూ వాహనాలు నడపవద్దని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామాలలో రోడ్డు సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేశారు.
MLG: ఏటూరునాగారానికి మండల కేంద్రానికి చెందిన సాయిరామ్ అథ్లెటిక్స్‌లో రజత పతకం సాధించాడు. హన్మకొండ జేఎన్ స్టేడియంలో ఏప్రిల్ 11, 12 తేదీల్లో జరిగిన తెలంగాణ స్టేట్ ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్–2026లో జూనియర్ బాలుర హైజంప్ విభాగంలో ఆయన ఈ పతకం సాధించాడు. ఈ సందర్భంగా సోమవారం కోచ్‌లు, కుటుంబ సభ్యులు సాయిరామ్‌ను అభినందించారు.
MBNR: మహబూబ్‌నగర్ మూడో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి రాచపూడి శ్రీదేవి బదిలీ సందర్భంగా న్యాయవాదుల బృందం ఆమెకు ఘనంగా వీడ్కోలు పలికింది. ఆమె అందించిన నిబద్ధతతో కూడిన సేవలు, నిజాయతీ, న్యాయం పట్ల ఆమెకున్న కరుణామయ దృక్పథాన్ని న్యాయవాదులు కొనియాడారు. ఈ సందర్భంగా ఆమెకు కృతజ్ఞతలు తెలుపుతూ గౌరవపూర్వకంగా సన్మానించారు.
NLG: పట్టణాల్లో పేరుకుపోతున్న ఘన వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణపై సిమెంట్ పరిశ్రమలు దృష్టి సారించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదేశించారు. ఇవాళ నల్గొండ, సూర్యాపేట జిల్లాల సిమెంట్ ఫ్యాక్టరీల యాజమాన్యాలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డంపింగ్ యార్డులకు 100 కి.మీ పరిధిలో ఉన్న పరిశ్రమలు, తమ ఇంధన అవసరాల్లో కనీసం 6 శాతం RDFను వాడాలని సూచించారు.
NRML: రైతులు ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ అన్నారు. భైంసా నియోజకవర్గంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు న్యాయమైన ధర కల్పిస్తామని తెలిపారు. గొల్లమాడ, తిమ్మాపూర్ గ్రామాల రైతులు వినతి పత్రం అందజేయగా స్పందించారు. ఇప్పటికే కొన్ని చోట్ల కేంద్రాలు ప్రారంభించామని, అవసరమైన చోట్ల త్వరలో ఏర్పాటు చేస్తామని తెలిపారు.
NZB: నిజామాబాద్ సుభాష్ నగర్‌లోని ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన నూతన ఏసీబీ కార్యాలయాన్ని సీపీ సాయి చైతన్య ప్రారంభించారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పరిధిలోని ఈ కార్యాలయ ప్రారంభోత్సవంలో రేంజ్ ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్, ఇన్‌స్పెక్టర్లు వేణుకుమార్, నగేష్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. అవినీతి నిర్మూలనే లక్ష్యంగా ఈ కేంద్రం పనిచేస్తుందన్నారు.
KNR: మొలంగూర్ గ్రామంలో ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. హెల్మెట్ ధరించడం తప్పనిసరని, గత ఏడాది రోడ్డు ప్రమాదాల వల్ల 200 మంది ప్రాణాలు కోల్పోవడం విచారకరమని, ఇందులో మెజారిటీ ద్విచక్ర వాహనదారులే ఉన్నారని పేర్కొన్నారు.
KMR: ఏబీవీపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉచిత పాలిటెక్నిక్ కోచింగ్ అందిస్తున్నట్లు నాయకులు తెలిపారు. వశిష్ట డిగ్రీ కళాశాలలో తరగతులు నిర్వహించనున్నట్లు చెప్పారు. రేపటి నుంచి అడ్మిషన్లు ప్రారంభమవుతాయని, పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. వివరాలకు 7075502187, 9100831725 సంప్రదించాలన్నారు.
WGL: GWMC ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. అదనపు కమిషనర్ చంద్రశేఖర్ ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి సంబంధిత విభాగాలకు పంపించారు. టౌన్ ప్లానింగ్ 40, ఇంజనీరింగ్ 24, రెవెన్యూ 7, హెల్త్ 8, నీటి సరఫరా 5, హార్టికల్చర్ 1గా మొత్తం 85 ఫిర్యాదులు అందాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
MHBD: నూతన వ్యాపారం ప్రారంభించి నలుగురికి ఉపాధి కల్పించడం అభినందనీయమని తొర్రూరు మున్సిపల్ ఛైర్మన్ తూనం శ్రవణ్ కుమార్ అన్నారు. సోమవారం తొర్రూరు పట్టణ కేంద్రంలో స్వాగత్ గ్రాండ్ టీ-టిఫిన్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌ను మున్సిపల్ ఛైర్మన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వయం ఉపాధి కల్పించుకోవడంతో పాటు నలుగురికి ఉపాధి కల్పించడం గొప్ప విషయం అన్నారు.
SRPT: కోదాడ టౌన్-1 ఫీడర్ పరిధిలో మంగళవారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు విద్యుత్ అంతరాయం కలుగుతుందని ఏఈ నరసింహా నాయక్ తెలిపారు. లైన్ మరమ్మతులు, చెట్ల తొలగింపు కారణంగా ఖమ్మం క్రాస్ రోడ్, భవాని నగర్, గోపిరెడ్డినగర్, గుడిబండ రోడ్ ప్రాంతాల్లో సరఫరా ఉండదని పేర్కొన్నారు. పనుల దృష్ట్యా వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.