Modi: ఈనెల 7న రాష్ట్రానికి మోడీ..కీలక నేతలకు 3 హెలికాప్టర్లు
తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైంది. అధికార పార్టీతోపాటు ప్రతిపక్షాలు సైతం ప్రచారం షురూ చేశాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రధాని మోడీని ప్రచారంలో వినియోగించుకునేందుకు బీజేపీ ప్లాన్ చేసింది. ఈ క్రమంలో మోడీ ఈనెల 7, 11 తేదీల్లో రాష్ట్రానికి రానున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీల నేతలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా..ప్రచారం కూడా జోరుగా కొనసాగుతుంది. ఈ క్రమంలో అధికార పార్టీని ఈసారి ఓడించేందుకు కాంగ్రెస్, బీజేపీలు కసరత్తు చేస్తున్నాయి. అందులో భాగంగా ఈ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ(modi) పలుమార్లు తెలంగాణలో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే నివేదికల ప్రకారం మోడీ నవంబర్ 7, 11 తేదీల్లో రాష్ట్రానికి రానున్నట్లు తెలుస్తోంది.
ఈ తేదీలలో హైదరాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, నల్గొండ జిల్లాలో నిర్వహించే సభల్లో పాల్గొననున్నట్లు తెలిసింది. అయితే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ నేతను సీఎం చేస్తామని బీజేపీ నాయకత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ రాష్ట్రానికి రావడం స్థానిక బీజేపీ నేతల్లో సంతోషం నెలకొంది. మరోవైపు రాష్ట్రంలో ఈనెల 15 నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా కొనసాగనుంది. ఈ క్రమంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా(amit shah) సహా పలువురు కేంద్ర మంత్రులు ఈ ప్రచారంలో పాల్గొననున్నారు. మరోవైపు ఈనెల 19వ తేదీ తర్వాత మోడీ మళ్లీ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని తెలుస్తోంది. ఈ క్రమంలో పార్టీకి బీజేపీ నాయకత్వం మూడు హెలికాప్టర్లను కేటాయించింది. వాటిలో ఒకటి బండి సంజయ్ కి కేటాయించగా..మరో రెండు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, ఈటల రాజేందర్ల ప్రచారానికి వినియోగించనున్నారు. అయితే బండి సంజయ్ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహించనున్నారు.