Rahul Gandhi: కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈరోజు లక్ష్మీ బ్యారేజ్‌ను పరిశీలించారు. హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్‌లో మేడిగడ్డ చేరుకున్న రాహుల్ మొదట అంబటిపల్లిలో మహిళా సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సు తర్వాత బ్యారేజీని పరిశీలించడానికి వెళ్లారు. మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన తర్వాత రాహుల్ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ పార్టీకి ఏటీఎంగా మారిందన్నారు. ప్రజాసందపను బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకుంటోందని రాహుల్ విమర్శించారు.
మేడిగడ్డ బ్యారేజీని రాహుల్ ఈ రోజు పరిశీలించారు. బ్యారేజీ కొన్ని దగ్గర్లు క్రాక్‌లు వచ్చాయని పోస్ట్‌లో తెలిపారు. దీనికి కొందరు స్పందిస్తూ.. అవి క్రాక్‌లు కావు.. జాయింట్స్ అని కామెంట్లు చేస్తున్నారు. తెలంగాణలో లక్షల కోట్ల రూపాయల ప్రజల సొమ్ము దోపిడీ జరిగిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ డబ్బంతా బయటకు కక్కిస్తామని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి ఒకవైపు ఉన్నాయని, కాంగ్రెస్ మరోవైపు ఉందన్నారు. బీఆర్ఎస్కు బీజేపీ, ఎంఐఎం సహాయం చేస్తుందన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పూర్తి మద్దతు ఇచ్చి బీఆర్ఎస్ను గద్దె దింపాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
రాష్ట్ర సంపదను కేసీఆర్ దోచుకుని తెలంగాణలో ప్రతి కుటుంబంపై అప్పు భారాన్ని మోపారని విమర్శించారు. కేసీఆర్ దోచుకున్న సొమ్మును తిరిగి ప్రజలకు చెరేలా చేస్తామని అన్నారు. మోదీ, కేసీఆర్ పాలనలో సిలిండర్ ధర రూ.12 వందలకు చేరింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే గ్యాస్ సిలిండర్‌ను రూ.500కు అందిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహాలక్మీ పథకంలో భాగంగా మహిళలకు రూ.2,500 ఇస్తామని చెప్పారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పారు.