బాసర అమ్మవారి ఆలయంలోకి వరసగా పాములు వస్తున్నాయి. విషయం తెలిసి భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. తెల్లవారుజామున అమ్మవారికి అభిషేకం చేయడానికి వెళ్లే పూజారులు భయపడుతున్నారు.
Basara: జ్ఞాన సరస్వతీ దేవి కొలువైన బాసరలో (Basara) పాములు కలకలం రేపుతోన్నాయి. వరసగా పాములు కనిపించడంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. దీనికి కారణం ఆలయం వెనక ఉన్న కొండ చరియలు తొలగించడమేనని తెలుస్తోంది. వాటిని తొలగిస్తోండగా.. పాములు ఏకంగా ఆలయం లోనికి వస్తున్నాయి.
ఆలయ ప్రాంగనంలో గల దత్తాత్రేయ ఆలయంలో పూజారిని పాము కాటు వేసింది. వెంటనే ఆస్పత్రికి తరలించడంతో ప్రాణప్రాయం తప్పింది. దాంతో పూజారి కోలుకున్నారు. అన్నప్రసాదం పెట్టే భోజనశాలలో ఓ పాము కనిపించింది. ఆలయ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో స్నేక్ క్యాచర్ వచ్చి పామును పట్టుకున్నాడు. తాజాగా మరో పాము కనిపించింది. దీంతో భక్తులు భయ పడుతున్నారు.
నెల రోజుల నుంచి ఆలయంలోకి పాములు వస్తున్నాయని పూజారులు చెబుతున్నారు. ఉదయం అమ్మవారికి అభిషేకం చేయాలంటే భయంగా ఉంటుందని పూజారులు చెబుతున్నారు. టెంపుల్ డెవలప్ చేయడంలో భాగంగా కొండ చరియలు తొలగిస్తున్నారు. అందులో ఉన్న కొండ చిలువలు ఆలయంలోకి వస్తున్నాయి. ఉదయం ఆలయంలోకి వెళ్లే పూజారులు హోం గార్డ్స్ వెంట పెట్టుకొని వెళ్లాలని ఆలయ ఈవో సూచించారు.
బాసర అమ్మవారి ఆలయంలో సత్యనారాయణ వ్రతాలు జరుగుతాయి. అక్షరాభ్యాసాలు కూడా జరుగుతుంటాయి. నిత్యం భక్తుల రద్దీతో ఉండే ఆలయంలోకి పాములు రావడంతో కలకలం రేగింది.