తెలంగాణ మంత్రి కేటీఆర్… సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుకుగా ఉంటారు. ఆయన ఏ విషయాన్ని అయినా సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటారు. సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకు అందరి ట్వీట్లకు ఆయన రిప్లై కూడా ఇస్తూ ఉంటారు. ఈ సోషల్ మీడియా ను ఉపయోగించి కరోనా సమయంలో ఎంతో మంది సమస్యలను ఆయన పరిష్కరించారు. కేవలం కరోనా సమయంలోనే కాదు… ఆ తర్వాత కూడా ఆయన వివిధ రకాల సమస్యలకు ట్విట్టర్ వేదికగా పరిష్కరించిన సందర్భాలు చాలా నే ఉన్నాయి.
ఈ సంగతి పక్కన పెడితే.. తాజాగా ఆయన ట్వట్టర్ లో అరుదైన ఫోటోని షేర్ చేశారు. అభిమానులకు తన తాత (అమ్మ తండ్రి)ను పరిచయం చేశారు. ‘నా కుటుంబం నుంచి స్ఫూర్తిదాయకమైన వ్యక్తిని మీ అందరికీ పరిచయం చేస్తున్నాను: మా తాత శ్రీ జె. కేశవ రావు గారు. గాంధీజీ స్ఫూర్తితో 1940ల చివర్లో తెలంగాణ తిరుగుబాటులో భాగంగా నిజాంకు వ్యతిరేకంగా పోరాడారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా భారత ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందారు.’ అంటూ కేటీఆర్ రాసుకొచ్చారు.
గాంధీజీ పిలుపు అందుకొని తెలంగాణ ప్రాంతంలో స్వాతంత్య్రోద్యమ పోరాటంలో పలు నిరసన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు కేశవరావు. నిజాం నిరంకుశ పాలనపైనా పోరాటం చేశారు. ఎన్నోసార్లు జైలుకి వెళ్లొచ్చారు. తన చెల్లెలు కవిత, ఇతర కజిన్స్ బ్రదర్స్‌తో కలిసి తాత కేశవరావుతో తీయించుకున్న ఫొటోను కేటీఆర్ షేర్ చేశారు.