కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి పై తెలంగాణ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం 9 మెడికల్ కాలేజీలు మంజూరు చేశారంటూ కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ మండిపడ్డారు.
ఈ తప్పుడు ప్రచారంపై కేంద్రమంత్రికి క్షమాపణ చెప్పే ధైర్యం కూడా లేదని మండిపడ్డారు. హైదరాబాద్ లో గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆ తర్వాత ప్రకటించారని… ఎప్పటిలాగే, మీ గుజరాతీ బాస్ లు దానిని వారి రాష్ట్రానికి మార్చారని విమర్శించారు.
పైగా.. హైదరాబాద్ ప్రజలను తప్పుదోవ పట్టించారు అంటూ కిషన్ రెడ్డిపై ఫైరయ్యారు. అయినప్పటికీ తప్పుడు వాదనను సరిదిద్దుకోలేదని… తెలంగాణ ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను కేంద్ర ప్రభుత్వం ఎందుకు తుంగలో తొక్కుతున్నదో ప్రధాని మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీఆర్ఏలో తెలంగాణకు గానీ, పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కు గానీ ఇచ్చిన ఒక్క హామీని కూడా నిలబెట్టుకోకపోవడం సిగ్గుచేటు అంటూ కేటీఆర్ మండిపడ్డారు.
అదే విధంగా బయ్యారం స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా కేటీఆర్ విమర్శలు గుప్పించారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ నెలకొల్పడానికి పరిస్థితులు అనుకూలంగా లేవంటూ తప్పించుకుంటున్నారని ఫైర్ అయ్యారు. గుజరాత్ బాసులను మెప్పించేందుకు అసత్యాలను, తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని కిషన్ రెడ్డిపై కేటీఆర్ మండిపడ్డారు.