కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి రాజీనామాపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) స్పందించారు. ఎవరి ఊహాలు వారివి..ఎవరి ఇష్టం వారిదని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ (BJP) పోటీలో లేదని వారు అనుకుంటే సరిపోతుందా అని ఆయన అన్నారు. రాజగోపాల్ రెడ్డికి పార్టీ మంచి అవకాశం ఇచ్చిందని, జాతీయ స్థాయిలో పదవి కట్టబెట్టామని కిషన్ రెడ్డి చెప్పారు. అయినా పార్టీ మారడం ఆయన వ్యక్తిగత నిర్ణయమని వివరించారు. అయితే, వ్యక్తిగత కారణాలతో పార్టీకి రాజీనామా చేస్తూ ఆరోపణలు చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ (BRS) కు భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయం కాబోదని రాజగోపాల్ రెడ్డి అన్నారు.
బీజేపీకి రాజీనామా చేస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పాలనకు చెక్ పెట్టేది తామేనని కిషన్ రెడ్డి మరోమారు స్పష్టం చేశారు. కాగా, పార్టీ హైకమాండ్ నుంచి పిలుపు రావడంతో బుధవారం కిషన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీ పెద్దలతో ఆయన భేటీ కానున్నారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, జనసేనతో పొత్తుపై ఈ భేటీలో చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి (Komati Reddy Rajagopal Reddy) రాజీనామాపై బీజేపీ సీనియర్ జితేందర్ రెడ్డి ఘాటుగా రియాక్ట్ అయ్యారు. రాజగోపాల్ రెడ్డి ఓ పాసింగ్ క్లౌడ్ (passing cloud) అని అన్నారు. పార్టీ ఎప్పుడు బలంగా ఉంటుంది.. కొందరు అలా వచ్చి ఇలా వెళ్తారని కౌంటర్ ఇచ్చారు. ఇక, వచ్చే ఎన్నికల్లో తాను ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నాని జితేందర్ రెడ్డి మనసులోని మాట బయటపెట్టారు.