ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రత భారీగా పెరిగింది. ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం పెరగడం వల్ల స్కూళ్లకు సెలవులు ఇవ్వనున్నారు. అలాగే ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ కల్పించనున్నారు. మరింత వాయుకాలుష్యం పెరితే మాత్రం లాక్ డౌన్ తప్పదని నిపుణులు ఆందోళన చెందుతున్నారు.
ఢిల్లీలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడి ప్రజలకు గాలి పీల్చుకోవడానికి కూడా చాలా ఇబ్బంది కలుగుతోంది. ఢిల్లీలో వాయు కాలుష్యం భారీగా పెరిగింది. తాజాగా వాయు నాణ్యత సూచీ 302కి చేరుకోవడంతో అధికారులందరూ ఆందోళన చెందుతున్నారు. ఢిల్లీలో సగటు ఎయిర్ క్వాలిటీ సూచీ 200 నుంచి 300 మధ్య ఉందని అధికారులు తెలిపారు. గాలి నాణ్యత రోజురోజుకూ దిగజారిపోతోందని, దీపావళి పండగకు ముందే ఈ పరిస్థితి వస్తే దీపావళి తర్వాత అది మరింత ప్రమాదకరంగా మారనుందని అధికారులు వెల్లడించారు.
ఎస్ఏఎఫ్ఏఆర్ తెలిపిన వివరాల ప్రకారంగా ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ నేటి మధ్యాహ్నానికి 330కి చేరుకుందని, ఇది ఇలాగే కొనసాగితే లాక్ డౌన్ విధించాల్సిన పరిస్థితి వస్తుందని నిపుణులు తెలిపారు. ఢిల్లీ నగరంలో వాతావరణం రోజురోజుకూ మరింత దిగజారుతోందని ఎయిర్ క్వాలిటీ కమిషన్ భయాందోళన చెందుతోంది. జనం ప్రైవేటు వాహనాలను కాకుండా ప్రజా రవాణాను వినియోగించుకోవాలని అధికారులు చెబుతున్నారు. కాలుష్య స్థాయిలు మరింత పెరిగితే మాత్రం ఢిల్లీలో కొత్త ఆంక్షలు అమలు చేసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
నగరంలో కాలుష్యం స్టేజ్3కి చేరుకుంటే చాలా వెహికల్స్ను నిషేధించే అవకాశం ఉందని, అత్యవసర సేవల వెహికల్స్కు కూడా అనేక పరిమితులు విధించాల్సి రావొచ్చని అధికారులు వెల్లడించారు. రైల్వేలు, జాతీయ భద్రతా ప్రాజెక్టులు, హాస్పిటల్స్, మెట్రో, హైవేలు, రోడ్లు మినహా ఇతర ప్రాజెక్టులన్నీ నిలిపివేసే అవకాశం కూడా వచ్చే అవకాశం ఉందని అధికారులు భయాందోళన చెందుతున్నారు. వాయు కాలుష్యం పెరుగుతున్న తరుణంలో విద్యాసంస్థలకు సెలవులను కూడా ప్రకటించనున్నారు. అలాగే ప్రైవేటు, ప్రభుత్వ ఆఫీసుల్లో ఉద్యోగులు 50 శాతం సామర్థ్యంతో పనిచేసే విధంగా పర్మిషన్లు ఇవ్వనున్నట్లు సమాచారం అందుతోంది.