రాజస్థాన్ (Rajasthan) దంత రామ్‌గర్ నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికలు సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తున్న వేళ ఓ మహిళ ఏకంగా సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన తన భర్తపైనే పోటీకి దిగింది. ఇక్కడ కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా వీరేంద్ర సింగ్ (Virendra Singh) ఉన్నారు. ఈయన భార్య రీటా చౌధరీ (Rita Chaudhary) గత ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డారు. ఈసారి ఆమె జననాయక్ జనతా పార్టీలో చేరి అదే స్థానం నుంచి పోటీకి సై అన్నారు.తన మనస్సాక్షి చెప్పిన విధంగానే నడుచుకుంటానని, అందుకే జేజేపీ పార్టీ(JJP Party)లో చేరానని ఆమె తెలిపారు. తన నిర్ణయాన్ని ప్రజలు ఆమోదించారని, ఈ ఎన్నికల్లో తప్పక విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
మరోవైపు, అల్వార్ రామ్‌గర్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే షఫియా జుబైర్‌కు అధికార కాంగ్రెస్ టికెట్ నిరాకరించి ఆమె భర్త, మాజీ ఎమ్మెల్యే జుబీర్ ఖాన్(Zubir Khan)కు పార్టీ తరఫున అవకాశం కల్పించింది. దీనిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఆమె స్పందిస్తూ.. ‘‘అభివృద్ధి, నీటి సమస్యలు, నిరుద్యోగిత వంటి సమస్యలనే ఎన్నికల ప్రచారంలో నా అస్త్రాలుగా చేసుకుంటాను. ఇప్పుడు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నవారు బాగానే పనిచేశారు. కానీ చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి’’ అని చెప్పారు. భర్తతో పోటీపై ప్రశ్నించగా.. కాంగ్రెస్(Congress)లో ఆయనకు ఇంకా టికెట్ ఖరారు కాలేదు కాబట్టి దానిపై ఇప్పుడే మాట్లాడబోనన్నారు. మరోవైపు- వీరేంద్ర సింగ్ మాత్రం ఈ ఎన్నికల్లో తనకు, తన భార్యకు మధ్య ప్రత్యక్ష పోరు ఉంటుందని పేర్కొన్నారు.