ఇప్పటికే ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా ‘హనుమాన్’ చిత్రం చాలాసార్లు వాయిదా పడింది. అయినా కూడా ఈ సినిమా పై భారీ అంచానలున్నాయి. ఎందుకంటే.. ఒక్క టీజర్‌తో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఆదిపురుష్ గ్రాఫిక్స్ కంటే హనుమాన్ గ్రాఫిక్స్ బెటర్ అనే టాక్ సొంతం చేసుకుంది. అందుకే హనుమాన్ సినిమా పై మంచి బజ్ ఉంది. కానీ గ్రాఫిక్స్ కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. ముందుగా మే 12న రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే ఆదిపురుష్ రిజల్ట్‌ను బట్టి హనుమాన్ విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవచ్చు.. అప్పటి వరకు గ్రాఫిక్స్ వర్క్స్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు.. అందుకే.. హనుమాన్ను పోస్ట్ పోన్ చేశారు.
ఆ తర్వాత ఆగస్టు 25న వస్తుందని అనుకున్నారు. కానీ ఫైనల్‌గా సంక్రాంతి బరిలోకి దూసుకొస్తోంది హనుమాన్ సినిమా. జనవరి 12న హనుమాన్ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. అయితే, సంక్రాంతికి మహేష్ బాబు, నాగార్జున, విజయ్ దేవరకొండ, వెంకటేష్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. పోటీ తీవ్రంగా ఉండటంతో ఈ సినిమా వాయిదా పడే అవకాశాలున్నాయని అన్నారు. కానీ ఎవ్వరు తగ్గిన మేం మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా.. మరోసారి రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చారు. అలాగే, ట్రైలర్ గురించి కూడా అప్డేట్ ఇచ్చారు.
దసరా సందర్భంగా.. తేజా సజ్జా కోర మీసాలతో స్టైలిష్‌గా ఉన్న హనుమాన్ పోస్టర్ రిలీజ్ చేస్తూ.. జనవరి 12న వస్తున్నామని చెప్పుకొచ్చారు మేకర్స్. అంతేకాదు.. హనుమాన్ ట్రైలర్‌ను అతిత్వరలో రిలీజ్ చేస్తామని ట్వీట్ చేశారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమానను తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం మరియు మరాఠీలో కూడా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అంతేకాదు.. ఇంగ్లిష్, స్పానిష్, కొరియన్, జపనీస్ మరియు చైనీస్ భాషల్లోనూ విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.