»Kcr Brs Party Ready To Contest In Maharashtra Local Body Elections
BRS Party కేసీఆర్ సంచలన నిర్ణయం.. రాష్ట్రం దాటి తొలిసారి అక్కడ పోటీ
కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ప్రారంభించినప్పుడు తొలిసారి స్థానిక సంస్థల ఎన్నికల్లోనే పోటీ చేసి తెలంగాణ వాదాన్ని బలంగా చాటారు. పార్టీ ప్రారంభించిన కొన్ని రోజులకే అత్యధిక స్థానాలు గెలుపొంది కేసీఆర్ సంచలనం రేపారు. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే ముందు మహారాష్ట్ర స్థానిక ఎన్నికలు కూడా ఆ విధంగానే ఉపయోగపడతాయని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
బీఆర్ఎస్ (BRS Party) పేరిట జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (K Chandrashekar Rao) భవిష్యత్ కార్యాచరణపై పూర్తి దృష్టి సారించారు. జాతీయ రాజకీయాల్లో (National Politics) దూకుడు పెంచుతున్నారు. ఇతర రాష్ట్రాల రాజకీయాలపై సమాలోచనలు చేస్తున్నారు. పార్టీని ఇతర రాష్ట్రాల్లో బలోపేతం చేయడంపై చర్చలు చేస్తున్నారు. తొలిసారి తెలంగాణ దాటి ఇతర రాష్ట్రంలో పోటీ చేయాలనే నిర్ణయించారు. ఈ క్రమంలోనే మహారాష్ట్ర (Maharashtra)పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. త్వరలోనే మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికలు (Maharashtra Local Body Elections) రాబోతున్నాయి. వాటిలో పోటీ చేయాలని సీఎం కేసీఆర్ సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
బీఆర్ఎస్ స్థాపించినప్పటి నుంచి ఆ పార్టీ అధినేత కేసీఆర్ మహారాష్ట్రపైనే ప్రత్యేక శ్రద్ధ ఉంచారు. తరచూ మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పర్యటిస్తున్నారు. తెలంగాణకు సరిహద్దున ఉండడం.. తెలంగాణ పాలనపై మహారాష్ట్ర ప్రజల్లో చర్చ కొనసాగుతోంది. ఇప్పటికే మరాఠా గడ్డపై నాందేడ్ (Nanded) సభతో అక్కడి రాజకీయాల్లో కేసీఆర్ అలజడి రేపారు. బహిరంగ సభ ఊహించని రీతిలో విజయవంతం కావడంతో మహారాష్ట్రలోనే బీఆర్ఎస్ పార్టీ ప్రత్యక్ష రాజకీయాలు ప్రారంభించాలని భావిస్తున్నారు. మరాఠా గడ్డలో జరిగే ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సోమ, మంగళవారాల్లో ప్రగతిభవన్ (Pragati Bhavan)లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా (Adilabad District) బీఆర్ఎస్ పార్టీ నాయకులతో సీఎం కేసీఆర్ చర్చించారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్, మాజీ మంత్రి జోగు రామన్న, మాజీ ఎంపీ గోడం నగేశ్ తో పాటు ఇతర నాయకులతో కేసీఆర్ సమీక్షించారు. రెండు రోజుల పాటు సుదీర్ఘంగా జరిగిన చర్చలో మహారాష్ట్రలో పోటీ చేయాల్సిందేనని నిర్ణయించినట్లు తెలుస్తున్నది.
మహారాష్ట్రలో జిల్లా పరిషత్ (ZPTC), మండల పరిషత్ సభ్యుల (MPTC) ఎన్నికలు జరుగనున్నాయి. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీకి నిలపాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఒక పంచాయతీ పరిధిలో ముగ్గురు వరకు జెడ్పీటీసీలు, ఆరుగురు ఎంపీటీసీలు ఉండడంతో అన్ని చోట్ల పోటీకి దిగాలని చర్చించినట్లు తెలుస్తున్నది. ఇక జెడ్పీ చైర్మన్ ను జెడ్పీటీసీలే ఎన్నుకోనుండడంతో ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని పార్టీ నాయకులకు సీఎం కేసీఆర్ సూచించినట్లు సమాచారం. సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ప్రారంభించినప్పుడు తొలిసారి స్థానిక సంస్థల ఎన్నికల్లోనే పోటీ చేసి తెలంగాణ వాదాన్ని బలంగా చాటారు. పార్టీ ప్రారంభించిన కొన్ని రోజులకే అత్యధిక స్థానాలు గెలుపొంది కేసీఆర్ సంచలనం రేపారు. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే ముందు మహారాష్ట్ర స్థానిక ఎన్నికలు కూడా ఆ విధంగానే ఉపయోగపడతాయని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలతోనే బీఆర్ఎస్ పార్టీ ప్రస్థానం మొదలవుతుందని గులాబీ శ్రేణులు భావిస్తున్నాయి.
ఈ ఎన్నికల కోసం మహారాష్ట్రకు పార్టీ ఇన్ చార్జ్ లుగా (Incharge) తెలంగాణకు చెందిన వారినే నియమించారు. ఆదిలాబాద్ ను ఆనుకుని ఉన్న మహారాష్ట్రలోని యావత్మాల్, వార్ధా, వాసిం జిల్లాలకు ఎమ్మెల్యే జోగు రామన్న, గోడం నగేశ్ లను ఇన్ చార్జ్ లుగా కేసీఆర్ నియమించారు. ఇక చంద్రపూర్, గడ్చిరోలి జిల్లాలకు బాల్క సుమన్ కు బాధ్యతలు అప్పగించారు. బాధ్యులుగా నియమితులైన వారు నిత్యం ఆయా జిల్లాల్లో పర్యటించాల్సి ఉంది. పార్టీని బలోపేతం చేయడంపై పూర్తి దృష్టి సారించాలని కేసీఆర్ ఆదేశించినట్లు సమాచారం. కాగా వారికి సహాయంగా అడ్డి భోజారెడ్డి, అరిగెల నాగేశ్వర్ రావు, పురాణం సతీశ్ తదితర సీనియర్ నాయకులు మహారాష్ట్రలో పార్టీ కార్యక్రమాలకు సహకారం అందించనున్నారు. కాగా ఇటీవల మహారాష్ట్ర కిసాన్ సెల్ (Kisan Cell President) అధ్యక్షుడిగా మాణిక్ కదమ్ (Manik Kadam)ను కేసీఆర్ నియమించిన విషయం తెలిసిందే.