తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనుమడు, మంత్రి కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు నాయకత్వ లక్షణాలు పుణికి పుచ్చుకున్నాడు. తాత, తండ్రి నుంచి నాయకత్వ లక్షణాలు మెండుగానే వచ్చాయి. అందుకే తాను చదువుకుంటున్న పాఠశాలలో ప్రతిష్ఠాత్మక కార్యక్రమం విజయవంతంగా నిర్వహించాడు. విద్యార్థులందరూ కలిసి ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి దాని ద్వారా వచ్చే డబ్బుతో చెరువు పునరుద్ధరణకు సహాయం చేయనున్నారు. ఇంతటి గొప్ప కార్యక్రమానికి హిమాన్షు నాయకత్వం వహించాడు. ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యం ప్రోత్సాహం.. తోటి విద్యార్థులు, స్నేహితుల సహాయంతో కార్యక్రమం నిర్వహించాడు.
ఓక్రిడ్జ్ పాఠశాలలో హిమాన్షు చదువుతున్న విషయం తెలిసిందే. సృజనాత్మకత, సామాజిక దృక్పథంతో కోణంతో పాఠశాలలో శనివారం ‘కాస్నివాల్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కాస్నివాల్ కు స్కూల్ క్రియేటివిటీ, యాక్టివిటీ, సర్వీస్ ప్రెసిడెంట్ గా హిమాన్షు నియమితుడయ్యాడు. ఈ కాస్నివాల్ ను మొత్తం హిమాన్షు ఆధ్వర్యంలో జరిగింది. ప్రదర్శనలో భాగంగా 30కి పైగా ఏర్పాటుచేసిన స్టాల్స్ లలో విద్యార్థుల తమలోని సృజనాత్మకతను వెలికి తీశారు. ఫుడ్, ఫన్, గేమ్స్ ప్రధానంగా ఈ ఉత్సవం జరిగింది. ఓక్ జైలు, సైకిల్ పెయింటింగ్ స్టాల్స్, లైవ్ మ్యూజిక్ కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరవగా.. సినీ నటుడు నిఖిల్ సిద్ధార్థ్, కిరణ్ అబ్బవరం సందడి చేశారు. అనంతరం స్టాల్స్ ను సందర్శించిన మంత్రి సబితా విద్యార్థుల ప్రతిభను చూసి మెచ్చుకున్నారు. కాస్నివాల్ కార్యక్రమంతో వచ్చిన డబ్బులను నానక్ రాంగూడ చెరువు పునరుద్ధరణ, సుందరీకరణ కోసం ఇవ్వడం అభినందనీయమని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా హిమాన్షు మీడియాతో మాట్లాడగా.. అచ్చం కేటీఆర్ మాట్లాడినట్టు ఉంది. ఆ మాటతీరు, హావభావాలు కేటీఆర్ మాదిరి ఉన్నాయి.