తెలంగాణ విద్యార్థులు అలర్ట్ కావాలి. ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలు వచ్చేశాయి. ఉన్నత విద్య చదవాలంటే ప్రవేశ పరీక్షలు తప్పనిసరిగా రాయాల్సిందే. ఉమ్మడి పరీక్షల్లో మంచి ర్యాంకు సాధిస్తే అత్యుత్తమ కళాశాలల్లో సీట్లు పొందే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను ఖరారు చేసింది. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు అధికారులు ఎంసెట్, ఈసెట్, లాసెట్, ఐసెట్, ఎడ్ సెట్ తదితర ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేశారు.
అంతకుముందు మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, వైస్ చైర్మన్ వెంకటరమణతో పాటు ఇతర ఉన్నత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పరీక్షల నిర్వహణపై చర్చించారు. పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. దరఖాస్తుకు రిజిస్ట్రేషన్ ఫీజు, ఇతర వివరాలతో సవివర నోటిఫికేషన్లు సెట్ కన్వీనర్లు ప్రకటిస్తారని తెలిపారు.
పరీక్షల షెడ్యూల్
– మే 7 నుంచి 14 వరకు ఎంసెట్ పరీక్షలు
(7 నుంచి 11 వరకు ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు, 12 నుంచి 14 వరకు వ్యవసాయ, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు)
– మే 18న ఎడ్ సెట్ (బీఈడీ)
– మే 20న ఈసెట్
– మే 25న లాసెట్ (ఎల్ఎల్ బీ), పీజీ లాసెట్
– మే 26, 27న పీజీ ఐసెట్ (ఎంబీఏ, ఎంసీఏ)
– మే 29 నుంచి జూన్ 1 వరకు పీజీ ఈసెట్