తెలంగాణలో అధికార పార్టీ లక్ష్యంగా కేంద్ర సంస్థల దాడులు కొనసాగుతున్నాయి. అవినీతి ఆరోపణలు రావడం, భారీగా అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల నివాసాలపై ఐటీ శాఖ అధికారులు సోదాలు చేపడుతున్నారు. కొన్ని నెలల నుంచి ఈ దాడుల పరంపర కొనసాగుతోంది. ఎప్పుడు ఎవరి మీద దాడులు జరుగుతాయో తెలియడం లేదు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించడం.. బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేయడం.. కేంద్ర సంస్థలను బహిరంగంగానే విమర్శించడం వంటి పరిణామాలు జరిగాయి.
ఈ క్రమంలోనే కేంద్ర పెద్దల ఆదేశాలతోనే తెలంగాణపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రత్యేక దృష్టి సారించాయని తెలుస్తోంది. కొన్ని నెలల కిందట మంత్రులు మల్లారెడ్డి, జగదీశ్ రెడ్డి లక్ష్యంగా ఐటీ దాడులు జరిగాయి. ఇక మంత్రి గంగుల కమలాకర్ విషయంలోనైతే ఐటీతోపాటు ఈడీ దాడులు జరగడం తీవ్ర కలకలం రేపింది. అరెస్ట్ చేసే స్థాయికి పరిణామాలు జరిగాయి. తర్వాత దర్యాప్తు సంస్థలు వెనక్కి తగ్గాయి. కాగా ఇప్పుడు మాజీ కలెక్టర్, ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ పి. వెంకట్రామి రెడ్డి లక్ష్యంగా ఐటీ అధికారులు తనిఖీలు జరిగాయి.
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల నివాసాలు, కార్యాలయాల్లో తనిఖీలు చేపట్టారు. మంత్రి మల్లారెడ్డి విషయంలోనైతే ఐటీ దూకుడుగా వెళ్లింది. రెండు మార్లు విచారణకు కూడా పిలిచింది. జగదీశ్ రెడ్డి విషయంలో కూడా దాడులు చేయడం తీవ్ర రాజకీయ వివాదం రేపింది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా దాడులు చేయిస్తోందని ఆరోపించారు. దీంతోపాటు బీఆర్ఎస్ పార్టీకి మద్దతుదారులుగా, ఆర్థికంగా అండగా ఉంటున్న వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులపై కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఎప్పుడు ఎవరి నివాసాలపై దాడులు జరుగుతాయోమోనని తెలంగాణలోని వ్యాపారవేత్తలు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ ఏర్పడిన ఆరేండ్లలో ఇలాంటి దాడులు జరగలేదు. కేసీఆర్ కేంద్రానికి వ్యతిరేకంగా గళం విప్పడంతో కేంద్ర సంస్థలు రంగంలోకి దిగాయి. ఎన్నికలు సమీపిస్తుండడంతో ఈ దాడులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది.