Delhi High Court : ఢిల్లీ హైకోర్టు నుంచి కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రూ.105 కోట్ల పన్ను రికవరీ నోటీసు కేసులో కాంగ్రెస్‌కు ఊరట లభించలేదు. ఐటీ శాఖ సీజ్ చేసిన రూ.105 కోట్లను రిలీజ్ చేయాలంటూ ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. ఇటీవల ఐటీ శాఖ కాంగ్రెస్ ఖాతాను ఫ్రీజ్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఖాతాను పునరుద్ధరించినా.. అందులోని రూ.105 కోట్ల ట్యాక్స్ పై నోటీసు జారీ చేసింది. దీనిపై స్టే విధించాలని కాంగ్రెస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది. కాంగ్రెస్ పన్ను పెనాల్టీ కేసులో ITAT ఆర్డర్‌తో జోక్యం చేసుకోవడానికి కోర్టు నిరాకరించింది.
2018-19 మదింపు సంవత్సరానికి సంబంధించి రూ.102 కోట్ల బకాయి పన్నును రికవరీ చేయాలని కాంగ్రెస్‌కు ఐటీ శాఖ నోటీసు జారీ చేసింది. మార్చి 8న, ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్ (ITAT) నోటీసుపై స్టే కోరుతూ పార్టీ దాఖలు చేసిన దరఖాస్తును కొట్టివేసింది. దీంతో కాంగ్రెస్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు తమ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తే.. పార్టీ కార్యకలాపాలకు చాలా ఇబ్బంది అవుతుందని ఆ పార్టీ తరఫున న్యాయవాది వివేక్ తంఖా కోర్టును కోరారు. 2021లో పన్ను డిమాండ్‌లో 20 శాతం చెల్లించేందుకు కాంగ్రెస్‌కు వెసులుబాటు కల్పించినట్లు ఐటీ శాఖ తరపు న్యాయవాది తెలిపారు.