తెలంగాణలో మళ్లీ ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులు దాడులు జరిపారు. హైదరాబాద్ లో మంగళవారం తెల్లవారుజామునే ఐటీ సోదాలు మొదలవడం కలకలం రేపింది. వసుధ ఫార్మా కెమ్ లిమిటెడ్ తో పాటు పలు చోట్ల ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ వ్యాప్తంగా మొత్తం 40 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. వసుధ ఫార్మా చైర్మన్ రాజుతో పాటు సంస్థ డైరెక్టర్ల నివాసాల్లోనూ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో తనిఖీలు చేపడుతున్నారు.
ఫార్మా రంగంతో పాటు రాజు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడా నిర్వహిస్తున్నారు. మొత్తం 15 కంపెనీల పేరుతో రాజు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నట్లు సమాచారం. నివాసాలు, కార్యాలయాల్లో అధికారులు దాడులు జరిపారు. తెలంగాణను లక్ష్యంగా చేసుకుని ఐటీ దాడులు వరుసగా జరుగుతున్నాయి. కొన్ని నెలల వ్యవధిలో తెలుగు రాష్ట్రాల్లో 50 కి పైగా ప్రాంతాల్లో ఏకకాలంలో ఐటీ శాఖ దాడులు జరిగాయి. రియల్ ఎస్టేట్, సినిమా నిర్మాతల నివాసాలపై దాడులు చేసిన విషయం తెలిసిందే.