హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలో అంతర్రాష్ట్ర ముఠా దొంగలు చేతివాటం చూపిస్తున్నారు. దొంగతనాలు, దోపిడీలు, స్నాచింగుల్లాంటివి ఇక్కడ అంతకంతకూ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఇక్కడ చదివేయండి.
Robbers : మెట్రో సిటీ అయిన హైదరాబాద్లో దొంగలు(Robbers) బీభత్సం సృష్టిస్తున్నారు. అంతర్రాష్ట్ర ముఠాలు నగరంలో చొరబడినట్లు తెలుస్తోంది. నగర శివార్లలో తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్గా చేసుకుని వీరు పని చేస్తున్నారు. దీంతో రోజు రోజుకీ దొంగతనాలు, స్నాచింగ్లు, దోపిడీలు ఇక్కడ పెరిగిపోతున్నాయి. ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఇలాంటి కేసులు రోజు రోజుకూ ఎక్కువ అవుతున్నాయి. ఇదివరకటి కాలంలో అంతర్రాష్ట్ర ముఠాలు నగరంలోకి రావాలంటే భయపడేవి. అయితే ఇప్పుడు పరిస్థితి అలా లేదు. సునాయాశంగా వారు రాకపోకలు సాగిస్తున్నారు. వారి ఆచూకిని పోలీసులు గుర్తించలేక తలలు పట్టుకుంటున్నారు.
ఆ మధ్య కాలంలో చుడిదార్ గ్యాంగులు, చడ్డీ గ్యాంగులు నగరంలో హల్చల్ చేశాయి. అలాగే నల్గొండ జిల్లాలో పార్ధీ గ్యాంగును పోలీసులు అరెస్టు చేశారు. నాగోలు పరిధిలోని గోల్డెన్ లీవ్స్ విల్లాస్ గేటెడ్ కమ్యూనిటీలో రెండు విల్లాల్లో చోరీలు జరిగాయి. హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దొంగతనాలు థార్ గ్యాంగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పుడు గేటెడ్ కమ్యునిటీలను టార్గెట్గా చేసుకుని వీరు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇవన్నీ అంతర్రాష్ట్ర దొంగల(Interstate Robbers) ముఠాల పనులేనని పోలీసులు చెబుతున్నారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు వెల్లడించారు. అయితే ఎంతకీ వారి ఆచూకీ దొరకకపోతుండటంతో తలలు పట్టుకుంటున్నారు. నగర రోడ్ల మీద ఉన్న సీసీ కెమెరాల నెట్వర్క్ ఆధారంగా వారి ఆచూకీని రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.