»Dussehra Where The Money Poured In A Record With An Income Of Rs 25 Crores In 10 Days
TSRTC: కాసులు కురిపించిన దసరా..10 రోజుల్లో రూ.25 కోట్ల ఆదాయంతో రికార్డు!
దసరా పండగ సందర్భంగా టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ బస్సుల ద్వారా టీఎస్ఆర్టీసీకి కేవలం 10 రోజుల్లోనే రూ.25 కోట్ల వరకూ ఆదాయం లభించింది.
టీఎస్ఆర్టీసీ (TSRTC)కి దసరా (Dasara) పండగ కోట్ల వర్షం కురిపించింది. ఈ పండగకు టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కేవలం 10 రోజుల్లోనే ఆర్టీసీ ఖజానాకు సుమారు రూ.25 కోట్ల వరకూ ఆదాయం వచ్చి చేరింది. ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు. దసరా పండగ పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ, కర్ణాటక రాష్ట్రాలకు ఈ ఏడాది 5,500 ప్రత్యేక బస్సులను టీఎస్ ఆర్టీసీ నడిపినట్లు తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం అదనంగా మరో 1,302 ప్రత్యేక బస్సులను టీఎస్ ఆర్టీసీ నడిపింది.
ప్రయాణికుల సౌకర్యార్థం ఎంజీబీఎస్, జేబీఎస్ లతో పాటుగా నగరంలోని అన్ని పికప్ పాయింట్ల నుంచి స్పెషల్ బస్సులను టీఎస్ ఆర్టీసీ అందుబాటులోకి ఉంచింది. గత ఏడాదిలాగానే ఈ సారి కూడా సాధారణ ఛార్జీలనే వసూలు చేసింది. అలాగే ఈసారి డైనమిక్ ఛార్జీలను టీఎస్ ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చింది. విశాఖపట్నం, విజయవాడ, బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాలకు వెళ్లేవారు డైనమిక్ ఫేర్‌ను బాగా వినియోగించుకున్నారు.
ప్రైవేట్ ట్రావెల్స్తో పోల్చితే డైనమిక్ ఛార్జీలు కాస్త తక్కువగానే ఉండటంతో జనాలు ఆర్టీసీ బస్సుల్లోనే ఎక్కువగా ప్రయాణించారు. పండగ సందర్భంగా అక్టోబర్ 13వ తేది నుంచి 24వ తేది వరకూ ప్రత్యేక బస్సులను టీఎస్ఆర్టీసీ నడిపింది. తిరిగి వచ్చే ప్రయాణికుల కోసం కూడా ప్రత్యేక బస్సులను నడిపింది. సాధారణంగా అయితే రోజూ ఆర్టీసీకి 12 నుంచి 13 కోట్ల వరకూ ఆదాయం రాగా దసరా పండగకు మాత్రం రోజూ అదనంగా రూ.2 నుంచి రూ.3 కోట్ల వరకూ ఆదాయం వచ్చింది. ఇందులో అత్యధికంగా ఒక రోజు రూ.19 కోట్ల వరకూ ఆదాయం వచ్చినట్లుగా టీఎస్ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.