డీకే శివకుమార్ (DK Sivakumar) త్వరలోనే తెలంగాణ ఇంచార్జిగా బాధ్యతలు చేపడతారని తెలుస్తున్నది. ఇటీవలే ఉప ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. కర్ణాటక(Karnataka)లో ప్రభుత్వం కాస్త కుదురుకున్నాక.. తెలంగాణ (Telangana) బాట పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు కూడా డీకే ఎప్పుడు వస్తారా అని ఆశగా ఎదరు చూస్తున్నారు. ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) పలు మార్లు డీకేని కలిసి రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని వివరించారు. కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో కూడా డీకే శివకుమార్ ఇమేజ్ పెరిగింది. దీంతో ఆయనతో పలు బహిరంగ సభలో నిర్వహించడానికి కూడా టీ కాంగ్రెస్(T Congress) ప్లాన్ సిద్ధం చేసింది. సీఎం కేసీఆర్ వంటి బలమైన నాయకుడిని ఎదుర్కోవాలంటే డీకే వంటి వ్యూహకర్త సేవలు తప్పకుండా అవసరం అవుతాయని భావిస్తున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్‌గా పని చేస్తున్న సునిల్ కనుగోలు (Sunil kanugolu) కు కూడా డీకే శివకుమార్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. అంతే కాకుండా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్లు కూడా డీకేకు బాధ్యతలు అప్పగించడం పట్ల సానుకులంగా ఉన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధించడం వెనుక డీకే వ్యూహాలు ఎన్నో ఉన్నాయి. పోల్ మేనేజ్మెంట్(Poll Management), మీడియా మేనేజ్మెంట్, పార్టీ అంతర్గత వ్యవహారాలు చక్కదిద్దడం వంటి అనేక అంశాల్లో డీకేకు మంచి పట్టుంది. ఎన్నికల వ్యూహాల్ని అమలుచేయగల నేర్పరి. ఆయన పనితనాన్ని గుర్తించిన కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ బాధ్యతల్ని ఆయనకు అప్పగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. పార్టీని డీకే ముందుండి నడిపిస్తే.. ఇతర వ్యవహారాల్ని పార్టీ ప్రధాన కార్యదర్శి, సీనియర్ నేత ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) చూసుకుంటారు.
ఈ నిర్ణయాలతో తెలంగాణపై కాంగ్రెస్ గట్టి ఫోకస్ చేసినట్లే కనిపిస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించడం వెనుక డీకే వ్యూహాలు చాలా కీలకం. అందుకే వాటిని తెలంగాణలో అమలు చేయబోతున్నారు. మరోవైపు కర్ణాటక మాదిరి ప్రజాకర్షక పథకాల్ని కూడా ప్రవేశపెట్టబోతున్నారు. ఈ దిశగా కసరత్తులు జరుగుతున్నాయి. రైతు రుణమాఫీ(Farmer loan waiver), ఉచిత గృహ విద్యుత్, నిరుద్యోగ భృతి, మహిళలకు ఆర్థిక సాయం వంటి పథకాల్ని తెలంగాణలోనూ ప్రకటించే అవకాశం ఉంది. ఈ పథకాల అమలుతోపాటు వివిధా పార్టీల నేతల్ని కాంగ్రెస్‌లో చేర్చుకునే అంశంపై కూడా డీకే పక్కా ప్రణాళికతో ఉన్నారని తెలుస్తోంది. ఆయన సూచనల మేరకే తెలంగాణలో నేతలు దూకుడుగా పని చేస్తున్నారు. మరి డీకే వ్యూహాలు ఇక్కడ ఏ మేరకు పనిచేస్తాయో చూడాలి.