»Harvard University Medical Morgue Manager Stole And Human Body Parts Sell Online
Human Organs Sell : షాకింగ్..శవాలను ముక్కలు చేసి ఆన్లైన్లో అమ్మకం..!
మెడికల్ కాలేజీ విద్యార్థులు ప్రాక్టికల్స్ చేయడం కోసం విరాళంగా వచ్చిన మృతదేహాలతో ఓ వ్యక్తి వ్యాపారం చేశాడు. శరీర భాగాలను అమ్ముతూ జేబును నింపుకునేవాడు. తాజాగా అతని వ్యాపారం బయటపడింది.
అమెరికాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. మృతదేహాలను ముక్కలు చేసి ఓ వ్యక్తి ఆన్లైన్లో అమ్ముతున్న ఘటన బయటపడింది. అమెరికా హార్వర్డ్ మెడికల్ యూనివర్సిటీలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. అంతర్జాతీయంగా పేరుపొందిన వర్సిటీలోనే ఇంతటి దారుణం జరగడంపై అందరూ పెదవి విరుస్తున్నారు. యూనివర్సిటీలోని మార్చురీ మేనేజర్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. వైద్య విద్యార్థులు పరిశోధనల కోసం విరాళంగా కొంత మంది మృతదేహాలను ఇస్తుంటారు. వాటితోనే మార్చురీ మేనేజర్ వ్యాపారం మొదలు పెట్టాడు.
ప్రాక్టికల్స్ కోసం మెడికల్ కాలేజీకి వచ్చిన మృతదేహాల నుంచి మార్చురీ మేనేజర్ తల, మెదడు, చర్మం, ఎముకలను ఆన్లైన్లో అమ్మేవాడు. సెడ్రిక్ లాడ్జ్ అనే ఆ వ్యక్తి వర్శిటీ మార్చురీలో ఉండే మృతదేహాల భాగాలను వేరుచేసి వాటిని గాఫ్స్టౌన్లోని తన ఇంటికి తీసుకెళ్తూ ఉండేవాడు. ఆ తర్వాత అక్కడే తన వ్యాపారం మొదలు పెట్టేవాడు. మృతదేహాల నుంచి వేరు చేసిన భాగాలను ఇద్దరు వ్యక్తుల సాయంతో విక్రయించేవాడు.
2018 నుంచి 2022 మధ్య వరకూ అతని వ్యాపారం లక్ష డాలర్లకు చేరుకుంది. అయితే తాజాగా ఓ మహిళ అవయవాలను కొనుగోలు చేసే క్రమంతో ఈ దారుణ వ్యాపారం బయటపడింది. ఈ కేసు విషయంలో అమెరికాకు చెందిన ఎఫ్బీఐ రంగంలోకి దిగి మార్చురీ మేనేజర్ సెడ్రిక్ లాడ్జ్ ను అరెస్ట్ చేసింది. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ఆరుగురిని కూడా అరెస్ట్ చేసింది. మృతదేహాల అవయవాలు అమ్ముతున్నాడనే ఆరోపణలు రావటంతో అతనిని వర్సిటీ ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.