»Congress Leader Who Drank Insecticide For Not Giving Ticket Tension In Bansuwada
Congress: టిక్కెట్ ఇవ్వలేదని పురుగుల మందు తాగిన కాంగ్రెస్ నేత..బాన్సువాడలో ఉద్రిక్తత
తనకు ఇస్తానన్న టికెట్‌ను ఆఖరి నిమిషంలో వేరొక వ్యక్తి ఇవ్వడంతో బాన్సువాడ నియోజకవర్గ ఇంఛార్జ్ కాసుల బాలరాజు ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. పురుగుల మందు తాగడంతో ఆయన్ని ఆస్పత్రికి తరలించారు.
ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని కాంగ్రెస్ నాయకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన బాన్సువాడలో చోటుచేసుకుంది. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బాన్సువాడ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంఛార్జ్ కాసుల బాలరాజు ఆత్మహత్యాయత్నం చేసుకోవడం కలకలం రేపింది. తనకు బాన్సువాడ టిక్కెట్ రాలేదని మనస్తాపంతో పురుగుల మందు తాగారని స్థానికులు తెలిపారు. ఆత్మహత్యాయత్నం చేసిన కాసుల బాలరాజును బాన్సువాడ రీజినల్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందించారు.
ఈ మధ్యనే ఏనుగు రవీందర్ రెడ్డి బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరగానే ఆయనకు కాంగ్రెస్ పెద్దలు టిక్కెట్ కేటాయించారు. తాను ఎప్పటి నుంచో పార్టీ కోసం కష్టపడుతున్నానని, కానీ రవీందర్ రెడ్డి పార్టీలో చేరీచేరగానే టిక్కెట్ కేటాయించారని కాసుల బాలరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చేరిన ఆయన్ని బీఆర్ఎస్, బీజేపీ నేతలు పరామర్శించారు.
ఏనుగు రవీందర్ రెడ్డి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిని చవిచూశారు. ఆ తర్వాత బీజేపీలో చేరిన ఆయన, ఈ మధ్యనే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆఖరి నిమిషంలో వచ్చిన రవీందర్ రెడ్డికి టికెట్ ఎలా ఇస్తారంటూ బాలరాజు అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఈ దారుణానికి పాల్పడ్డాడు. టికెట్ ఇవ్వకపోతే ఓ దశలో బాలరాజు ఆమరణ నిరాహార దీక్ష కూడా చేయనున్నట్లు స్థానికంగా చర్చ సాగుతోంది.