కామారెడ్డి, గజ్వేల్ ప్రాంతాల్లో రేపు సీఎం కేసీఆర్ నామినేషన్లు వేయనున్నారు. ఈ తరుణంలో కామారెడ్డిలో రేపు భారీ బహిరంగ సభ ఉంటుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. రాష్ట్రంలోకి ఎంత మంది పీకేలు, డీకేలు వచ్చినా ఏకే47 లాంటి సీఎం కేసీఆర్‌ను ఏం చేయలేరన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly Elections) నేపథ్యంలో నామినేషన్ల పర్వం పెరిగింది. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ ప్రచారాలతో దూసుకుపోతున్నాయి. బీఆర్ఎస్ను ఓడించేందుకు అన్ని పార్టీలు కష్టపడుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress)లు తమ సీనియర్ నాయకులతో సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నాయి. కాంగ్రెస్ తరపున రాహుల్, ప్రియాంక, ఖర్గే, డీకే శివకుమార్ వంటివారు తెలంగాణకు వచ్చి ప్రచారం నిర్వహించారు.
బీజేపీ తరపున ప్రధాని మోదీ (Pm Modi)తో పాటు కేంద్ర మంత్రులంతా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో (Elections Campaign) పాల్గొంటూ వస్తున్నారు. కమలంతో దోస్తీ చేస్తోన్న పవన్ (Pawan kalyan) కూడా సభలో పాల్గొన్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్, బీజేపీలపై మంత్రి హరీశ్ రావు (Harish Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. పీకేలు వచ్చినా, డీకేలు వచ్చినా తెలంగాణలో ఉన్న ఏకే47 కేసీఆర్‌ను ఏం చేయలేరని కౌంటరిచ్చారు. రేపు సీఎం కేసీఆర్ (CM KCR) నామినేషన్లు వేయనున్నారు. ఈ తరుణంలో ఆయన ఐఓసీ మైదానం వద్ద హెలిప్యాడ్ ఏర్పాట్లను పరిశీలించారు.
రేపు నామినేషన్ వేసేందుకు సీఎం కేసీఆర్ (CM KCR) హెలికాఫ్టర్ ద్వారా గజ్వేల్ చేరుకుంటారని, ఆ తర్వాత అక్కడి నుంచి కామారెడ్డి (Kamareddy) చేరుకుని నామినేషన్ వేస్తారని తెలిపారు. కామారెడ్డిలో భారీ బహిరంగ సభ ఉంటుందని, గజ్వేల్‌లో 28న ఎన్నికల ప్రచారం ముగింపు సభ ఉంటుందన్నారు. 2014, 2018 ఎన్నికల్లో కూడా ముగింపు సభను గజ్వేల్‌లో చేసుకున్నట్లు గుర్తు చేశారు.
కరువు పీడిత ప్రాంతమైన గజ్వేల్‌ను కాళేశ్వరం జలాలతో సస్యశ్యామలం చేశామని, అత్యధిక మెజార్టీతో గజ్వేల్‌లో గెలిచి తీరుతామని ధీమాను వ్యక్తం చేశారు. కొంత మంది పెద్దవాళ్లపై పోటీ చేస్తే పెద్దవాళ్లం అవుతారని అనుకుంటున్నారని ఈటల రాజేందర్‌ను ఉద్దేశించి కౌంటర్ వేశారు. తెలంగాణ ద్రోహులంతా ఏకమవుతున్నారని, షర్మిల (YS Sharmila) కాంగ్రెస్ పార్టీకి, పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీకి మద్దతు పలుకుతున్నారన్నారు. వారి నుంచి తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, బీఆర్ఎస్నే మళ్లీ గెలిపించాలని మంత్రి హరీశ్ రావు కోరారు.