Padi Koushik Reddy : రాజీనామా ఇచ్చేందుకు హరీష్ సిద్ధం…రేవంత్ సిద్ధమా : పాడి కౌశిక్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల ప్రకారం ఆగస్టు 15 తేదీలోపు 6 గ్యారంటీలు అమలు చేస్తే ఎమ్మెల్యే హరీష్ రావు ఏ పద్ధతిలో అయినా రాజీనామా చేసేందుకు రెడీగా ఉన్నారని.
Padi Koushik Reddy : కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల ప్రకారం ఆగస్టు 15 తేదీలోపు 6 గ్యారంటీలు అమలు చేస్తే ఎమ్మెల్యే హరీష్ రావు ఏ పద్ధతిలో అయినా రాజీనామా చేసేందుకు రెడీగా ఉన్నారని.. హామీలు అమలు చేయకపోతే రాజీనామాకు రేవంత్ రెడ్డి సిద్ధమా అని హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సవాల్ విసిరారు. శనివారం కరీంనగర్ లోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి కాగానే అహంకారం పెరిగిందన్నారు. మంత్రి హోదాలో కాకుండా మూర్ఖుడిలా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర మంత్రివర్గంలో సబ్జెక్టు లేని సన్నాసి ఎవరన్నా ఉన్నారంటే అది కోమటిరెడ్డి వెంకటరెడ్డే అన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక జోకర్, బ్రోకర్ ,తాగుబోతు అన్నారు.
ఎన్నికల సందర్భంగా రేవంత్ వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని ఇచ్చిన మాటను తప్పారన్నారు. మరోసారి మోసగించే ప్రయత్నం చేస్తుంటే ప్రజల తరఫున హరీష్ రావు నిలబడి రాజీనామాకు సైతం సిద్ధమయ్యారని.. అమర వీరుల స్తూపం వద్ద సవాల్ విసరడంలో తప్పేమిటని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి నిజంగా ఆరు గ్యారంటీలు అమలు చేసే సత్తా ఉంటే సవాళ్లు ఎందుకు స్వీకరించలేదో చెప్పాలన్నారు. రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, రైతుబంధు పేరిట ముఖ్యమంత్రి మోసం చేశారని, మిగిలిన గ్యారెంటీ ల విషయంలో కూడా ఆడపడుచులతోపాటు నిరుద్యోగులను తెలంగాణ ప్రజలను నట్టేట ముంచారన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన వద్ద 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని కెసిఆర్ తో మాట్లాడితే తానే ముఖ్యమంత్రి అవుతానని ఒక వ్యక్తితో స్వయంగా తనకే రాయబారం పంపారని అన్నారు. అయినప్పటికీ ఆయన మాటలను పట్టించుకోలేదని ఆయన పూటకో మాట మాట్లాడతారని తెలిసి ఆ మాటను పరిగణలోకి తీసుకోలేదు అన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మానసిక పరిస్థితి సరిగా లేదని ఆయనను ఆసుపత్రిలో చూపించాలన్నారు. హరీష్ రావు ను చూసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పనిచేయడం నేర్చుకోవాలని హితువు పలికారు.