»The New Rule Brought By The Election Commission Now They Will Also Be Marked With Ink
Telangana Elections: ఎన్నికల కమిషన్ తెచ్చిన కొత్త రూల్..ఇకపై వారికి కూడా సిరా గుర్తు
తెలంగాణ ఎన్నికలకు ముందు ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. పోలింగ్ బూత్‌ల వద్ద ఓటు వేయనివారికి సహాయకులుగా వచ్చిన వ్యక్తులకు ఇంక్ మార్క్ పెట్టనున్నట్లు తెలిపింది.
నిన్న జరిగిన మిజోరాం, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో గతంతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం తగ్గింది. ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (Telangana Assembly Elections) ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల కమిషన్ (Election Commission) గట్టి చర్యలు చేపట్టింది. ఇది వరకూ జరిగిన లోపాలు అన్నింటినీ సవరిస్తూ కొత్త ప్రణాళికలు వేస్తోంది. ముఖ్యంగా యువతను పోలింగ్ కేంద్రాలకు (Polling Centres) వచ్చి ఓటు వేసేలా ప్రోత్సహిస్తోంది. అందుకే ఆఖరి నిమిషం వరకూ కూడా ఓటు హక్కును నమోదు చేసుకునేందుకు ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించింది.
తెలంగాణ (Telangana)లో నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. మరో పది రోజుల ముందుగానే కొత్తగా ఓటరు కార్డుకు అప్లై చేసుకున్నవారికంతా గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు చూస్తోంది. స్పీడ్ పోస్టు ద్వారా గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు ఎన్నికల కమిషన్ సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేక అధికారులను కూడా నియమించింది. ఇకపోతే ఓటరు ఐడీతో పాటుగా ఈవీఎంలు, ఇతర ఏర్పాట్లపై కూడా ఎన్నికల కమిషన్ అధికారులు సమీక్షలు చేస్తున్నారు.
కొత్త రూల్ తెచ్చిన ఈసీ:
పోలింగ్ బూత్‌ల వద్ద రూల్స్‌పై ఇటీవలె ఎన్నికల కమిషన్ అధికారులు పలు మార్పులు చేశారు. ఈ ఎన్నికల్లో ఆ కొత్త రూల్స్ అమలు కానున్నాయి. ఓటు వేయలేని స్థితిలో ఉన్న ఓటరు వెంట సహాయకులు రావొచ్చు. అలా వచ్చిన వారికి కూడా ఇంక్ మార్క్ పెట్టాలని ఎన్నికల కమిషన్ కొత్త నిబంధన తీసుకొచ్చింది. అయితే గతంలో ఈ రూల్ అమలులో లేదు. అంతేకాకుండా బూత్ ఓటర్ మాత్రమే హెల్పర్‌గా ఉండాలని తెలిపింది. అప్పటికే ఓటు వేసిన వ్యక్తి మాత్రమే సహాయకుడిగా వెళ్లాల్సి ఉంటుందని తెలిపింది. అందుకే ఆ సహాయకుడి కుడి చేతి వేలికి ఇంక్ మార్క్ పెట్టనున్నట్లు తెలిపింది.
మాక్ పోలింగ్ (Mock Polling) కూడా ఈ సారి ఒక గంట ముందుగానే నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. ఉదయం 5.30 గంటలకు మాక్ పోలింగ్ కచ్చితంగా చేపట్టాల్సిందేనని అధికారులకు ఆదేశించింది. ప్రస్తుత నిబంధనల ప్రకారంగా ఏ ప్రాంతంలోని ఓటరైనా అభ్యర్థి తరపున పోలింగ్ ఏజెంట్ (Polling Agent)గా ఉండొచ్చని, వాళ్లు ప్రజాప్రతినిధులు కూడా అయి ఉండొచ్చని ఎన్నికల కమిషన్ తెలిపింది.