తెలంగాణ(Telangana)లో ఓటరు గుర్తింపు కార్డుల ముద్రణ ఈ నెల 20లోగా పూర్తి కావాలని ప్రత్యేక సాధారణ పరిశీలకుడు అజయ్ వి నాయక్ తెలిపారు. బీఆర్కే భవన్‌లోని ఎన్నికల సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో ఆయన మాట్లాడారు.‘పోలింగు ముగిసిన తరవాత ఈవీఎం (EVM) లను భద్రపరిచే కేంద్రాల్లో ఇతర ఎన్నికలకు సంబంధించిన ఈవీఎంలు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి’ అని స్పష్టం చేశారు. ‘ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే సిబ్బందికి చివరి దాకా శిక్షణలు నిర్వహించాలి’ అని ప్రత్యేక పోలీసు పరిశీలకుడు దీపక్ మిశ్రా (Deepak Mishra) సూచించారు.
‘అభ్యర్థుల (Candidates)ఖర్చులకు సంబంధించి షాడో రిజిస్టర్లను విధిగా అమలు చేయాలి’ అని ప్రత్యేక వ్యయ పరిశీలకుడు ఆర్.బాలకృష్ణన్ సూచించారు. ‘సాంకేతిక కారణాలతో రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు అనుమతులు నిరాకరించవద్దు’ అని తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ (Vikas Raj) స్పష్టం చేశారు.రాష్ట్రంలో ఎన్నికల వ్యవహారాలను పర్యవేక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించింది.ఇందులో విశ్రాంత ఐఏఎస్ అధికారి అజయ్ వి నాయక్, విశ్రాంత ఐపీఎస్ అధికారి దీపక్‌మిశ్ర, విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి ఆర్.బాలకృష్ణన్ ఉన్నారు