»Ap Ceo Mk Meena Press Meet On Election Arrangements
Elections 2024: ఏపీలో 4.14 కోట్ల మంది ఓటర్లు.. 46,389 పోలింగ్ కేంద్రాలు
త్వరలో ఏపీలో ఎన్నికలు జరుగనున్నాయి. రాష్ట్రంలో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. 65,707 మంది సర్వీసు ఓటర్లు ఉన్నట్లు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు.
Elections 2024: త్వరలో ఏపీలో ఎన్నికలు జరుగనున్నాయి. రాష్ట్రంలో మొత్తం 4.14 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. 65,707 మంది సర్వీసు ఓటర్లు ఉన్నట్లు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. తుది ఓటర్ల జాబితాలో 5.94 లక్షల మంది ఓటర్లు పెరిగారన్నారు. మే 13న జరిగే ఎన్నికల నిర్వహణకు 46,389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు అక్రమ నగదు రూ.203 కోట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. నగదుతో సహా మద్యం, గంజాయి, విలువైన ఆభరణాలను సీజ్ చేశామన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి ఇప్పటివరకు 864 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామన్నారు. సీజ్లకు సంబంధించి తొమ్మిది వేల కేసులు నమోదు చేశామన్నారు. 10,400లకు పైగా ఫిర్యాదులు పరిష్కరించామన్నారు. దాదాపు 14 నియోజకవర్గాల్లో వందశాతం వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఓటర్లకు ఎండతో ఇబ్బందులు కలుగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.
ఇంటి నుంచి ఓటేసేందుకు కేవలం 28591 మంది మాత్రమే ఎంచుకున్నారని. మొత్తంగా 7,28,484 మంది హోం ఓటర్లు ఉంటే కేవలం 3 శాతం మాత్రమే హోం ఓటింగ్ కోరుకున్నట్లు తెలిపారు. హోం ఓటింగ్ ప్రక్రియ ఇవాళ ప్రారంభమైందన్నారు. ఎనిమిదో తేదీలోగానే పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. కోర్టు ఆదేశాల మేరకు గాజు గ్లాస్ గుర్తును మొత్తంగా 15 చోట్ల మార్చామన్నారు. ఆ 15 స్థానాల్లో స్వతంత్రులకు వేరే గుర్తులు కేటాయించామన్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 1500 మంది ఓటర్లకు అవకాశం ఉంటుందన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి 1500 ఓటర్లకు మించి ఉంటే ఆ పోలింగ్ కేంద్రానికి అనుబంధంగా మరొక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తామని ఎంకే మీనా వెల్లడించారు.