CM KCR: నీళ్లు, నిధులు, నియామకాల పేరిట ఏర్పడిన తెలంగాణ(Telangana)లో ఒక్కొక్కటి సాధిస్తూ ప్రగతివైపు పరుగెడుంది. బంగారు తెలంగాణే ధ్యేయంగా రైతులకు సాగునీరును, తాగు నీరును అందించడంలో తెలంగాణ ప్రభుత్వం విజయం సాధించింది. ఉమ్మడి పాలమూరు – రంగారెడ్డి జిల్లాల ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది. కరువు, వలసలతో అల్లాడిన నేలపై కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. పూర్వ మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో తాగు, సాగు నీటి అవసరాలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును(Palamuru-Ranga Reddy lift project) ప్రారంభించిన సీఎం కేసీఆర్ జాతికి అంకితం చేశారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందినప్పుడు ఎంత సంతోష పడ్డానో ఈ రోజు పాలమూరు గడ్డపై కృష్ణా జలాలు పారుతుంటే అంత సంతోషం కలిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక మొట్టమొదట విద్యుత్ సమస్యపై దృష్టి పెట్టిమని, తరువాత పింఛన్లు క్రమంగా పెంచుకుంటూ పోతున్నామన్నామని వెల్లడించారు. ఇప్పుడు నీళ్ల సమస్య కూడా రాష్ట్రంలో ఎక్కడ లేదని ఈ విషయంలో గర్వపడుతున్నట్లు తెలిపారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అన్యాయం తప్ప అభివృద్ధి జరగలేదని, మహబూబ్‌నగర్‌కు ఒక్క వైద్యకళాశాల వచ్చిందా అని ప్రశ్నించారు. ఈ రోజు రాష్ట్రంలో మొత్తం 8 మెడికల్ కాలేజ్‌లు తెచ్చామని వివరించారు. అలాగే కృష్ణ జలాల్లో తెలంగాణ వాటా తేల్చమంటే ప్రధాని మోడీకి చేతకావడం లేదని దుయ్యబట్టారు. 9 ఏళ్లుగా ఎటు తేలచ్చడం లేదని, కృష్ణ ట్రిబ్యూనల్‌కు ఎందుకు ప్రతిపాదన పంపడం లేదని విమర్షించారు. అలాగే కొల్లాపూర్‌పై వరాల జల్లు కురిపించారు. కొల్లాపూర్‌లోని ప్రతి గ్రామానికి రూ. 25 లక్షలు మంజూరు అయ్యేలా మొత్తం రూ. 25 కోట్లను సీఎం కేసీఆర్ మంజూరు చేశారు.
ఎన్నోఏళ్ల కలను సాకారం చేస్తూ తాజాగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రారంభించారు. శనివారం సాయంత్రం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాజెక్ట్‌ను ఆన్ చేశారు. నార్లాపూర్ వద్ద తొలి పంపు స్విచ్ నొక్కి నీటిని విడుదల చేశారు. డెలివరి సిస్టర్న్ వద్ద సీఎం, మంత్రులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణా జలాలు నింపిన కలశాలకు వేదపండితులు పూజలు చేశారు. కలశాలను పలుగ్రామాల సర్పంచ్‌లకు అధికారులు అందజేయనున్నారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.