తెలంగాణలో అధికార బీఆర్ఎస్ (BRS)ను ఓడించాలనే పట్టుదలతో ఉంది బీజేపీ. ఇటీవలికాలం వరకూ కచ్చితంగా బీఆర్ఎస్ను బీజేపీ ఓడిస్తుందేమోననే సంకేతాలు కనిపించాయి. అయితే ఇటీవలికాలంలో కమలం పార్టీ దూకుడు తగ్గింది. బీఆర్ఎస్ ను ఓడించడం సంగతి పక్కన పెడితే మర్యాదపూర్వకమైన స్థానాలు గెలుచుకోగలిగితే చాలు అనే స్థాయికి దిగజారిపోయింది. అందులో భాగంగా తమతో కలసి వచ్చే పార్టీలతో పొత్తుల కోసం ప్రయత్నిస్తోంది. కానీ జనసేనతో పొత్తు తెలంగాణ బీజేపీలో కొన్ని చోట్ల చిచ్చు పెడుతోంది.శాసనసభ ఎన్నికలకు ముందు శేరిలింగంపల్లి (Serilingampally) నియోజకవర్గంలో బీజేపీకి గట్టి షాక్ తగిలింది.
బీజేపీకి సీనియర్ నేత మొవ్వ సత్యనారాయణ (Movva Satyanarayana) రాజీనామా చేశారు. ఆయనతో పాటు ఆయన సామాజిక వర్గానికి చెందిన పలువురు నేతలు రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీలో సామాజిక న్యాయం లేదని విమర్శించారు. జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలో 18 లక్షలకు పైగా కమ్మ సామాజికవర్గానికి చెందినవారు ఉన్నారని.. అయినా, ఒక్క సీటు కూడా కేటాయించలేదని దుయ్యబట్టారు. కమ్మ సామాజికవర్గానికి టికెట్ కేటయించకపోవడం బాధను కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ మారి వచ్చిన వ్యక్తికి కనీసం తమతో చర్చించకుండానే టికెట్ ఇచ్చారని విమర్శించారు. టికెట్ కేటాయించి ఇన్ని రోజులు గడుస్తున్నా ఇంత వరకు బీజేపీ (BJP) హైకమాండ్ నుంచి తమకు ఎలాంటి హామీ లభించలేదని తెలిపారు. తనను నమ్ముకున్న నేతలు, కార్యకర్తల కోసం బీజేపీకి రాజీనామా చేశానని తెలిపారు. తన అనుచరులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని చెప్పారు.