»This Is The Last Birthday In Visakha Swaroopananda Swami Made The Key Announcement
Visakhaలో ఇదే చివరి జన్మదినోత్సవం..కీలక ప్రకటన చేసిన స్వరూపానంద స్వామి
హైదరాబాద్‌పై విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు.హైదరాబాద్ కోకాపేటలో విశాఖ శ్రీ శారదాపీఠం చేపట్టిన ఆలయ ప్రాంగణాన్ని ఆధ్యాత్మిక అధ్యయన కేంద్రంగా తీర్చిదిద్దుతామని పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి ప్రకటించారు. వచ్చే ఏడాది నుంచి ఆ అధ్యయన కేంద్రంలోనే ఉంటూ ఆదిశంకరుల వారి అద్వైత తత్త్వంపై పరిశోధనలు చేపడతానని స్పష్టం చేశారు.
విశాఖ శారదా పీఠాధిపతి (Sarada Pithadhipahi) స్వరూపానందేంద్ర సరస్వతి కీలక ప్రకటన చేశారు. వచ్చే సంవత్సరం తాను హైదరాబాద్‌కు మకాం మార్చనున్నట్టు స్వామి వెల్లడించారు. హైదరాబాద్ లోని కోకాపేటలో ఉన్న పీఠంలో ఉంటానని తెలిపారు. విశాఖ శారదాపీఠం బాధ్యతలను స్వాత్మానందేంద్ర సరస్వతి చూసుకుంటారని తెలిపారు. నిన్న విశాఖ (Visakha) శారదాపీఠంలో స్వరూపానందేంద్ర స్వామి జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మేరకు ప్రకటించారు. ‘నేను సన్యాసం స్వీకరించి 30 ఏళ్లు పూర్తయింది. తెలుగునాట శంకరాచార్య సంప్రదాయాన్ని అనుసరిస్తూ ఆధ్యాత్మిక విప్లవాన్ని సృష్టించేలా విశాఖ శారదా పీఠాన్ని తీర్చిదిద్దాం. ఆదిశంకరుల అద్వైత తత్వంపై విదేశాల్లో సైతం అధ్యయనం జరుగుతోంది. నేను అధ్యయన కేంద్రంలోనే ఉంటూ పరిశోధనల్లో పాల్గొంటాను. పీఠం బాధ్యతలను వచ్చే ఏడాది.. పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామికి అప్పగిస్తాను. విద్యాధికుడైన ఆయన ధర్మ పరిరక్షణ బాధ్యతలు చూసుకుంటారు’ అని తెలిపారు.
భారతావని హిందూత్వానికి మాత్రమే వేదిక కాదని, ప్రపంచానికి ఆధ్యాత్మిక వర్శిటీలాంటిదని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి (Swarupanandendra Swamy) చెప్పుకొచ్చారు. సమాజంలో లౌకిక జ్ఞానం పెరుగుతున్నా ధార్మికమైన ఆధ్యాత్మిక జ్ఞానం తగ్గిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ధార్మిక తత్త్వం కనుమరుగు కాకుండా కొందరు బ్రాహ్మణోత్తములు వైదిక సదాచారాల ద్వారా కాపాడుతున్నారని ప్రశంసించారు. ఆదిశంకరుల వారి అద్వైత తత్త్వంపై విదేశాల్లో సైతం అధ్యయనం జరుగుతోందని, దేశంలోను లోతైన అధ్యయనం చేసేందుకు వీలుగా కోకాపేట(Kokapet)లో రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తర్కం, మీమాంస, వ్యాకరణాల్లో పాల్గొంటూ అధ్యయనం చేసే పండితులకు వసతి సదుపాయం కూడా ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసారు. కులం, మతం, జాతి చూడకుండా అద్వైత బోధనలు సాగిస్తామని చెప్పారు. తాను అధ్యయన కేంద్రంలోనే ఉంటూ పరిశోధనల్లో పాల్గొంటానని స్పష్టం చేసారు